లాక్‌డౌన్ సంపాదనలోనూ విరాట్ కోహ్లీ రారాజే
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2020 6:57 AM GMTప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే ఎక్కువ మంది చెప్పే సమాధానం విరాట్ కోహ్లీ. మైదానంలోనే కాదు సంపాదనలో కోహ్లీ దూసుకుపోతున్నాడు. కరోనా కారణంగా గత మూడు నెలలుగా క్రికెట్ మ్యాచ్‌లు ఏమీ జరగకున్నా కూడా కోహ్లీ సంపాదనకు ఢోకా లేదు. లాక్‌డౌన్ కాలంలోనూ సంపాదనలో కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. టాప్-10లో నిలిచిన ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లీ మాత్రమే. అటెయిన్ అనే సంస్థ మార్చి 12 నుంచి మే 14 వరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏయే ఆటగాడు ఎంత సంపాదించాడు అనే వివరాలను వెల్లడించింది. ఒక్కో పోస్టుకు కోహ్లీ 126431 పౌండ్లు (రూ.1.20కోట్లు) ఆర్జించాడు. మొత్తం మూడు పోస్టులకు గానూ 379294 పౌండ్లు సంపాదించాడు. అంటే భారత కరెన్సీలో రూ. 3కోట్ల 62 లక్షలు.
ఇక ఈ జాబితాలో పుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ ఏకంగా 1.8మిలియన్ పౌండ్లు సంపాదించి జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత కరెన్సీలో రూ. 17.21 కోట్ల. లియోనెల్ మెస్సి 1.2మిలియన్ పౌండ్లు(రూ.11.45 కోట్లు), నెయ్‌మార్ 1.1 మిలియన్ పౌండ్లతో(రూ. 10.50 కోట్లు) రొనాల్డొ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్-100 జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో భారత కెప్టెన్ 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే.. విరాట్ 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు.
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే క్రీడలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ క్రీడలు మొదలు అవుతున్నాయి. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా సీఏ ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. కరోనా తరువాత భారత జట్టు ఆస్ట్రేలియాలో ఆడనుంది. కాగా.. టీ20 ప్రపంచ కప్ పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ప్రపంచ కప్ వాయిదా పడితే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మార్గం సుగమమైనట్లై. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.