పద పదవే గాలిపటమా..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  14 Aug 2020 9:58 AM GMT
పద పదవే గాలిపటమా..!

నింగిలో పక్షిలా ఎగురుతూ ఉత్సాహాన్ని రేకెత్తించే గాలిపటం ఎగరేయడం అంటే కేవలం పిల్లలకే కాదు పెద్దలకూ పండగే. గాలిపటాలంటే పిల్లలకు చాలా ఇష్టం. గాలిపటం అంటనే మన బాల్యపు తీపి జ్ఞాపకం. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నాడు పతంగులు ఎగరేయడం సంప్రదాయం. గాలిపటం ఎగరవేసేందుకు ప్రత్యేకించి మాంజాలు తయారు చేసుకుంటుంటారు. మాంజాకు చిక్కుకుని పావురాలు మరణించే సంఘటనలూ ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో గాలిపటంతో పాటు కబూతర్‌ (పావురాలు) ఎగరవేసే సంప్రదాయం ఉంది. ఢిల్లీ పాత సిటీలోనూ ఏటా ఈ పతంగుల వేడుక ఉత్సాహంగా జరుపుకొంటారు.

అయితే అది ఆగస్టు 15న.. అంటే మనకు సాంతంత్య్రం వచ్చిన రోజున.. రకరకాల ఆకృతుల్లో గాలిపటాలు గగన వీధుల్లో హల్‌చల్‌ చేస్తుంటాయి. గాలిపటం అంటేనే స్వేచ్చకు ప్రతీక. అందుకేనేమో ఢిల్లీ వాసులు మనకు స్వేచ్ఛ లభించిన రోజుకు తీపి గుర్తుగా ఈ పతంగుల పండగ చేసుకుంటారు. ఇది ఒక్క ఢిల్లీలోనే కనిపిస్తుంది. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం ఢిల్లీలోని ప్రతి గల్లీలోని ఇళ్ళపై పతంగులు ఎగరేస్తున్న కమనీయ దృశ్యాలు కళ్ళకు కడుతుంటాయి.

పతంగ సందేశాలు..

పతంగులను కేవలం ఆట వస్తువుగా కాకుండా అంతకు మించి సందేశాలు మోసుకెళ్ళే వారధిగా కూడా కొందరు రూపొందిస్తున్నారు. కాళిదాసు మేఘసందేశం ప్రియుడు ప్రియురాలికి పంపితే.. ఈ పతంగ సందేశాలను ప్రజలకు సామాజిక స్పృహ కల్పించేలా పంపుతుంటారు. పాత ఢిల్లీలో రెండు వారాల కిందట సామాజిక వేత్త తఖి పతంగులు ఉచితంగా పంచుతున్నాడు. తఖి పతంగాలు ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటాయి. ఏదో ఒక సామాజిక సందేశం ఉంటుంది. ఈ సారి పతంగాలపై.. 20 సెకన్లపాటు చేతులు సోపుతో కడగండి. ఆరడుగుల భౌతిక దూరం కచ్చితంగా పాటించండి.. అంటూ రాశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజల్లో ఆ వైరస్‌పై అవగాహన కల్పించే ఓ పవిత్ర ఉద్యమానికి గాలిపటాలను వినియోగించడం నిజంగా అద్భుతం.

హాస్‌ ఖాజితో ఉంటున్న తఖీ ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఢిల్లీ ఆకాశంలో వన్నె వన్నెల గాలిపటాలు సందడి చేయడం చూస్తుంటాడు. మామూలుగా కన్నా ఢిల్లీ ఆప్పుడు మరింత అందంగా కనిపిస్తుంటుంది. ఆకాశం బాల్యదశలో మారిపోయినట్టు అగుపిస్తుంది. ఏదైనా ఓ సందేశం ప్రజల్లో బలంగా పంపడానికి ఇంతకు మించిన సందర్భం ఉండదంటాడు తఖీ. అందుకే ప్రభావాత్మకంగా సందేశాలను గాలిపటాలపై రాసి అందరికీ ఉచితంగా పంచుతుంటాడు. ఇప్పడ కరోనా తప్ప మరో అంశం వార్తల్లో లేదు కాబట్టి.. కరోనా రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలపై తన గాలిపటాన్ని సంధించాడు. రెండేళ్ళ కిందట తఖీ మతసామరస్యానికి సంబంధించిన సందేశాలతో గాలిపటాలను రూపొందించి ఉచితంగా పంపిణీ చేశాడు.

గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం ఇప్పటిది కాదు. చాలా పురాతన సంప్రదాయమనే చెప్పాలి. తభి సామాజిక సందేశాల ప్రచారానికి పంతగులను ఆశ్రయిస్తున్నట్లే పాతకాలంలో అవసరమైన విషయాలను చేరవేయడానికి పంతంగులు, పావురాలను వినియోగించే వారని తెలుస్తోంది. అంతెందుకు స్వాంతంత్య పోరాటంలో బ్రిటీష్‌ దొరలకు వ్యతిరేకంగా సమాచారం చేరవేయడంలో ఈ గాలిపటాలు ప్రత్యేక పాత్రను పోషించాయి. పతంగాలను మొదట ఎగిరింది చైనాలోనే.

దాదాపు 2800 ఏళ్ల కిందట చైనాలోని మెలెనేసియా, మైక్రోనేసియా, పాలినేసియా ప్రాంతాల్లో ఈ పతంగాలను ఎగరేసేవారని ప్రముఖ రచయిత్రి నిఖితాదేశాయ్‌ తన ఎ డిఫరెంట్‌ ఫ్రీడమ్‌ అనే పుస్తకంలో రాశారు. అప్పట్లో పంతంగుల వాడే సందర్భాలు వేరుగా ఉండేవి. చైనా దేశం పతంగుల ద్వారా టపాసులు నింగిలో పేలేలా ప్రయత్నించేది. శత్రుసైన్యాన్ని భయపెట్టడానికి, నివారించడానికి ఈ తరహా పతంగుల్ని ప్రయోగించేవారని తెలుస్తోంది. బౌద్ధులు మనదేశానికి పతంగుల్ని తీసుకొచ్చినట్టు రచయిత్రి నిఖితా పేర్కొన్నారు. మన దేశం నుంచి అరేబియా ఉత్తర ఆఫ్రికా, యూరోప్‌ దేశాలకు విస్తరించినట్లు వివరించారు. భారతదేశంలో మొగల్‌ల పాలనా కాలంలో పతంగులు ఎగరేయడం క్రీడగా గుర్తింపు పొందినట్లు తెలుస్తోంది.

రానూరానూ గాలిపటాలు చారిత్రక అస్తిత్వాన్ని వదలి ఓ వేడుకగా ఓ సంరంభంగా మారిపోయాయి. తెలంగాణ, గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రతి సంక్రాంతికి పతంగులు ఎగరవేసే సంప్రదాయం ఉంది. అదే బెంగాల్‌లో విశ్వకామ పూజ, అక్షయతృతీయ పండగల్లో పతంగులు ఎగరేస్తుంటారు. ఈ స్రందాయాలు, చారిత్రక ఆనవాళ్ళు పక్కన పెడితే.. ఇప్పటికీ గాలిపటాలు ఎగరవేయడం అంటే పిల్లలకు పెద్దలకు ఓ పెద్ద సరదా!!

Next Story
Share it