కరోనా ఎఫెక్ట్.. ఈ సారి ఖైరతాబాద్ గణపతి ఎత్తు ఎంతంటే..?
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 12:00 PM GMTవినాయక చవితి అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 27 అడుగులకే పరిమితం చేశారు. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు తగ్గిస్తున్నారు. గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహాగణపతిగా పూజలు అందుకున్నాడు. . విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
ప్రతి ఏటా వివిధరూపాల్లో దర్శనమిచ్చే ఖైరాతాబాద్ గణేశుడు ధన్వంతరి వినాయకుడిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా సైతం దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు వైరస్ భయంతో నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పల్లెలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ మహానగరంలో గణేశుడి విగ్రహాలు గతంలో మాదిరిగా అధిక సంఖ్యలో ఏర్పాటు చేసే అవకాశాలు లేవు.