‘కేజీఎఫ్’ గురించి అంత హడావుడి చేస్తే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 July 2020 8:20 AM GMT
‘కేజీఎఫ్’ గురించి అంత హడావుడి చేస్తే..

ఎప్పుడో ఏడాదిన్నర ముందు విడుదలైన చిత్రం ‘కేజీఎఫ్’. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విరగబడి చూశారు జనాలు. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తే అక్కడా అపూర్వ ఆదరణ దక్కింది. దేశంలోనే ప్రైంలో అత్యధిక వ్యూయర్ షిప్‌ తెచ్చుకున్న సినిమాగా ఆ చిత్రం రికార్డులకెక్కింది.

ఐతే కొత్త సినిమా రిలీజైన రెండు మూడు నెలలకే టీవీల్లో ప్రిమియర్‌గా వేసేసే ఈ రోజుల్లో.. ‘కేజీఎఫ్’ను మాత్రం అలాగే దాచి పెట్టారు. టీవీల్లోకి తీసుకు రాలేదు. ఇందుకు కారణాలేంటో తెలియదు. టీవీలకు ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఫ్యామిలీస్ కూడా పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని చూసి ఉంటాయనడంలో సందేహం లేదు. అలాంటపుడు టీవీ ప్రిమియర్ మీద ఎవరికంత ఆసక్తి ఉంటుంది.

కానీ ఈ మధ్యే ‘కేజీఎఫ్’ తెలుగు వెర్షన్‌ను స్టార్ మాలో ప్రిమియర్‌గా వేశారు. దీనికి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్.. ఇద్దరూ కలిసి సినిమా గురించి ఇంటర్వ్యూలు ఇచ్చి.. వాళ్లు చెప్పిన విశేషాల్ని షో మధ్యలో స్నిపెట్స్‌ లాగా వేశారు. ఇటు టీవీలో, అటు సోషల్ మీడియాలో ప్రిమియర్ గురించి ఓ రేంజిలో ప్రచారం చేసి ఆ తర్వాత సినిమాను ప్రసారం చేశారు.

ఇంతా చేస్తే చివరికి ఈ సినిమాకు 11కు కాస్త ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ మధ్యే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని రెండోసారి టీవీలో ప్రసారం చేస్తే 18 దాకా రేటింగ్ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లు మూతపడి ఉన్న నేపథ్యంలో టీవీలో ఎలాంటి సినిమా వేసినా భారీగా రేటింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ‘కేజీఎఫ్’కు వచ్చిన రేటింగ్ చాలా తక్కువనే చెప్పాలి.

Next Story