మానవత్వం మీ రూపంలో బ్రతికే వుంది.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 9 July 2020 2:21 PM ISTఆధునిక యాంత్రిక జీవనంలో మనకోసం మనం ఆలోచించడంతోనే సరిపెట్టుకుంటున్న ఈ రోజుల్లో.. పక్కవారి గురించి ఆలోచించే సాహసం ఏ మాత్రం చేయం. పక్కవాడు ఏమైపోతే ఏంటి.. అని వదిలేస్తాం. కానీ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు అందరిని కదిలిస్తుంది. జీవితంలో కనీసం ఓ క్షణమైనా సాటివారి గురించి పాటుపడాలనే ఆలోచనను కలిగిస్తుంది.
ఏం జరిగిందంటే.. కంటిచూపు లేని ఓ వృద్ధుడు బస్సు కోసం పరిగెత్తడం చూసింది ఓ మహిళ. వృద్దుడి ప్రయత్నాన్ని చూసి ఆ మహిళ జాలిపడలేదు. అతనిని ఆ బస్సులో ఎక్కించాలనుకుని తాపత్రయపడింది. బస్సు ఆపమని అరుస్తూ పరిగెత్తింది. ప్రయాణికులు, బస్సు డ్రైవర్ గమనించించడంతో బస్సును ఆపారు. వెంటనే.. వెనుదిరిగి వెళ్లి ఆ పెద్దాయనను చేయి పట్టుకుని తీసుకువచ్చి బస్సు ఎక్కించింది.
ఈ ఘటన ఆ మహిళ కరుణా హృదయాన్ని తెలపడంతో పాటు.. మనం మరిచిపోయిన మానవత్వాన్ని మనకు గుర్తుచేస్తుంది. సాటివారిని గౌరవించడం.. సాయపడటం మన బాధ్యత అని చెప్పకనే చెబుతోంది. కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమె దయాగుణానికి తమదైన కామెంట్లతో బ్రహ్మరథం పడుతున్నారు.