ముఖంపై 60 వేల తేనె టీగలతో గిన్నీస్ రికార్డ్..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Jun 2020 10:46 AM GMT
ముఖంపై 60 వేల తేనె టీగలతో గిన్నీస్ రికార్డ్..

తేనె.. అబ్బా ! ఎంత తియ్యగా ఉంటుందో కదా. ప్రకృతి నుంచి సహజసిద్ధంగా లభించే తేనె రుచే వేరు కదా. ఎంత తేనెటీగల పెంపకం దారులైనా సరే అవి కుడితే అల్లాడిపోవాల్సిందే. ఒక్కసారి తేనెటీగ కుట్టిందంటే ముల్లు గుచ్చుకున్నట్లు..పెద్ద దద్దుర్లు లేదా బొబ్బలతో పాటు భరించలేనంత మంట, దురద కూడా వస్తాయి. తేనె టీగలు కుట్టిన వెంటనే స్నానం చేస్తే ఆ మంట, దురద ఒల్లంతా పాకిపోతుంది. ఒక్కోసారి అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు. కానీ ఓ తేనెటీగల పెంపకం దారుడు మాత్రం తన ముఖంపై 60వేల తేనెటీగలను 4 గంటల 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని గిన్నీస్ రికార్డులోకెక్కాడు.

S1

వివరాలు చూస్తే.. కేరళకు చెందిన సంజయ్ కుమార్ వృత్తిరీత్యా తేనెటీగలను పెంచుతూ.. తేనెను తయారు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇప్పుడు ఆ తేనెటీగలే అతడికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. తనకు ఏడేళ్ల ప్రాయం నుంచి తేనెటీగలను పెంచుతున్న సంజయ్..నిదానంగా వాటిని మచ్చిక చేసుకున్నాడు. అవి కుడితే ప్రమాదమని తెలిసి కూడా వాటిని తన ముఖం, కాళ్లు, చేతులపై వాలేలా చేశాడు. అది చూసి తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారట. ఆ తర్వాత ఏకంగా 4 గంటల 10 నిమిషాల పాటు తేనెటీగలను తన ముఖంపై ఉంచుకుని గిన్నీస్ రికార్డు సాధించాడు. తేనెటీగలను పెంచేవారు ఎంతటి అనుభవజ్ఞులైనా సరే ఇలాంటి సాహసం చేయాలంటే ఖచ్చితంగా భయపడుతారని అంటున్నాడు సంజయ్.

సంజయ్ గురించి తెలుసుకున్న ఓ మీడియా అతడిని ఇదంతా ఎలా సాధ్యమైందని ప్రశ్నించగా.. అదంత సులభం కాకపోయినా నిదానంగా అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. అవి ముఖం పై వాలినప్పుడు కూడా తాను మామూలుగానే నడవడం, డ్యాన్స్ చేయడం, చూడగలడం వంటివి సాధ్యమయ్యాయన్నాడు. తేనెటీగలను మనం మంచిగా చూస్తే..అవి కూడా మనల్ని ఏమీ చేయవంటున్నాడు సంజయ్. తేనెటీగలతో తనకున్న అనుబంధంతోనే ఎపీకల్చర్ బెంగళూరులో మాస్టర్స్ డిగ్రీ చేయాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. త్వరలోనే తేనెటీగలపై అధ్యయనం చేసి.. వాటి గురించిన ఆసక్తికరమైన విషయాలను అందరికీ తెలియజేస్తానని చెప్పాడు సంజయ్.

Next Story