సీఎం కేసీఆర్ వరంగల్ కు ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చారు

By సుభాష్  Published on  19 Aug 2020 5:26 AM GMT
సీఎం కేసీఆర్ వరంగల్ కు ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చారు

భారీగా కురిసిన వర్షాలు.. వరదతో పోటెత్తిన వరంగల్ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా.. ఆయన స్థానంలో మంత్రి కేటీఆర్ పర్యటించటం తెలిసిందే. మరోపక్క ఇలాంటి పరిస్థితే ఏపీలో నెలకొని ఉంటే.. అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లటం.. ఏరియల్ సర్వే చేశారు. వరద కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కదిలిన ఆయన.. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక్కొక్కరికి రూ.2వేల వరద సాయాన్ని అందించాలని నిర్ణయించి.. ఆదేశాలు జారీ చేసేశారు.

ఏపీలో ఇలా జరిగితే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంతకీ ఏపీలో జరిగినట్లుగా తెలంగాణలో ఎందుకు జరగలేదు? సీఎం వరంగల్ కు వెళ్లకుండా మంత్రి కేటీఆర్ ను ఎందుకు పంపినట్లు? ఇంత తీవ్రమైన సమస్య విరుచుకుపడిన సందర్భంలోనూ ఆయన ఎందుకు ప్రగతిభవన్ నుంచి ఎందుకు బయలకు రాలేదు? లాంటి ప్రశ్నలు ఎన్నో తెర మీదకు వచ్చాయి.

మనసుకు తట్టిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితి లేకున్నా.. అప్పుడప్పుడు అదృష్టం కలిసి వస్తే.. సమాధానాలు వాటంతట అవే వస్తాయన్నట్లుగా.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ప్రజలు పెద్ద కష్టపడకుండానే సీఎం కేసీఆర్ వరంగల్ ఎందుకు రాలేదన్న విషయం బయటకు వచ్చేసింది.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అన్యాపదేశంగా ముఖ్యమంత్రుల వారు వరంగల్ కు ఎందుకు రాలేదో చెప్పేశారు. ఇంతకూ సీఎం సార్ వరంగల్ కు రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

తాను కానీ వరంగల్ నగరాన్ని పర్యటిస్తే.. ఆ సందర్భంగా బాధితులకు అందే సహాయక కార్యక్రమాలపై ఎక్కడ ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతోనే ఆయన తన పర్యటనను వాయిదా వేసుకొని.. తనను పంపినట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకున్నా.. ఆయన తరఫున వచ్చిన కేటీఆర్ పర్యటన సందర్భంగానూ.. సీఎం వచ్చి ఉంటే ఎంత హడావుడి ఉందో.. అంతే ఉన్నాయన్న సందేహానికి సమాధానం మాటేమిటి? అన్నింటికి సమాధానాలు కోరుకోవటం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సైతం ఎప్పుడో ఒకరోజు సమాధానం దానంతట అదే వచ్చేయటం ఖాయం. కాకుంటే.. అప్పటివరకు వెయిట్ చేయాలంతే.

Next Story