తెలంగాణలో కరోనా వైరస్ పై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే సీం కేసీఆర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. కరోనాకు పారాసిట్‌మాల్‌ ట్యాబ్‌లెట్‌ వేసుకుంటే సరిపోతుందని కేసీఆర్‌ అన్నారని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అంతేకాక 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా రాదని, అంత ఎండలో ఆ వైరస్‌ చనిపోతుందని సీఎం అసెంబ్లీలో చెప్పారని భట్టి గుర్తు చేశారు. అలాంటప్పుడు కర్ణాటక వాసి హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత ఎలా చనిపోయాడని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

కాగా, భట్టి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరుంది కదా అని ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ప్రవర్తించకండి అని కేసీఆర్‌ హితవు పలికారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ధైర్యం చెప్పేందుకు తగిన ఉష్ణోగ్రత వద్ద వైరస్‌ బతకదని చెప్పానని, పారాసిట్‌మాల్‌ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని ఒక సైంటిస్ట్‌ తనతో చెప్పాడని గుర్తు చేశారు.

పాబబస్తీని ఎందుకు బద్నాం చేస్తున్నారు

పాతబస్తీని ఎందుకు బద్నాం చేస్తున్నారని, చిల్లర టీవీ ఛానళ్ల వారు ప్రచారం చేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చివరకు కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందని, ప్రజలు కంగారు పడతారని ఆ విషయాన్ని వాళ్లు నాలుగైదు రోజుల తర్వాత ప్రకటించారని అన్నారు. కరోనా వైరస్‌పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. కరోనా వైరస్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటుందని, వ్యాధి మరింత వ్యాపించకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. దేశానికి పట్టిన కరోనా వైరస్‌ కాంగ్రెస్సేనని సీంఎ తీవ్రంగా వ్యాఖ్యనించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.