స్కూళ్లు, థియేటర్లు బంద్‌ అయ్యే అవకాశం..?

By Newsmeter.Network  Published on  14 March 2020 8:38 AM GMT
స్కూళ్లు, థియేటర్లు బంద్‌ అయ్యే అవకాశం..?

కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ వైరస్‌ భారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలో నెల్లూరు యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారణ కాగా.. మరికొందరికి ఈ వైరస్‌ లక్షణాలుండటంతో ఐసోలేషన్‌ రూంలో వైద్యసేవలందిస్తున్నారు. ఇదిలాఉంటే తెలంగాణలోనూ కరోనా వైరస్‌ ప్రభావం పెరుగుతుంది. తాజాగా శనివారం రాష్ట్రంలోనూ కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్దారించారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌ శనివారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని, గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న మరో ఇద్దరి నమూనాలను పూణె పరీక్షా కేంద్రానికి పంపినట్లు కేసీఆర్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలోకరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్నట్లు అర్థమవుతుంది. ఈనేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీలో మరో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయ్‌.. మనం ఏం చేయాలి అనేదానిపై చర్చించాలని, ఏం చేయాలో సాయంత్రం 6గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

also read :ఆస్పత్రుల నుంచి కరోనా బాధితులు జంప్..ఆందోళనలో అధికారులు

దీనిని బట్టి చూస్తుంటే కరోనా వైరస్‌ ప్రభావం తగ్గే వరకు రాష్ట్రంలో స్కూళ్లు , థియేటర్లు బంద్‌ చేసేందుకు సర్కార్‌ నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో థియేటర్లు, స్కూల్‌ బంద్‌ చేయించారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఈ మేరకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ సీఎం కేసీఆర్‌ అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌ సమావేశమైంది. ప్రభుత్వం ఆదేశిస్తే థియేటర్లు మూసేందుకు సిద్ధంగా ఉన్నామని చాంబర్‌ ప్రెసిడెంట్‌ మురళి మోహన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొద్దికాలం థియేటర్లు మూసేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం పరీక్షలు సీజన్‌ కావటంతో ఈ విషయంలో కేబినెట్‌లో చర్చజరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని తరగతుల వరకు స్కూళ్లను కొద్దిరోజులు పాటు మూసివేందుకు కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సాయంత్రం కేబినెట్‌ బేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Next Story