విద్యుత్ పంపిణీ సంస్థలు బతకాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదని, అలా అని పేదలపై భారం మోపమని, అందులో పేదలకు మినహాయింపు ఉంటుందని.. వారిపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచుతామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడారు.. 24గంటలు కోతలు లేకుండా కరెంటు ఇస్తున్నప్పుడు ఛార్జీలు పెంపు తప్పదని కుండబద్దలు కొట్లారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే పన్నులు పెంచక తప్పదని, పన్నులు చెల్లించే స్తోమత ఉన్న వారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తామని అన్నారు. మొక్కలను పెంచే బాధ్యత ప్రజాప్రతినిధులదేనని, ఓట్ల కోసం భయపడే పరిస్థితి మాలో లేదన్నారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉండేలా పాలన అందిస్తామని కేసీఆర్ తెలిపారు.

అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ప్రతి నెల తప్పకుండా నిధులు విడుదల చేస్తామని, అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు నిలుపుదల చేసైనా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 500జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 20వరకు ఉన్నాయని, వీటిలోనూ ఐదేళ్లలో రూ. 40లక్షలు వస్తాయని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు విరాళాలు ఇస్తున్నారని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌ల పదవులు పోతాయని, గెలిచిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కేసీఆర్‌ హెచ్చరించారు.

ప్రతి గ్రామానికి రూ. 5లక్షలు ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. 12,751 గ్రామాల్లో చెత్త విసర్జన కేంద్రాలు, తాగునీటి వసతి, ట్యాంకర్లు ఇతర సౌకర్యాలు కల్పించామని అన్నారు. ప్రజలు సహకరించాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రజా ప్రతినిధులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పల్లె ప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించామని, 45మంది ఐఏఎస్‌ అధికారులతో కమిటీలు ఏర్పాటు చేశామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.