నిజమే.. మామ ఆదేశిస్తే.. అల్లుడు అమలు చేసేస్తాడు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2020 3:35 AM GMT
నిజమే.. మామ ఆదేశిస్తే.. అల్లుడు అమలు చేసేస్తాడు

తెలంగాణలో గడచిన ఆరేడేళ్లుగా ఓ సంప్రదాయం నడుస్తోంది. అదేమీ రాసి పెట్టుకున్న సంప్రదాయం కాదు గానీ... అది అలా జరిగిపోతూ ఉంటుంది. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతున్నా... ఎప్పటికప్పుడు అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయం పునరావృతమై మరోమారు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అదేంటంటే... రాష్ట్రవ్యాప్తంగా నియంత్రిత వ్యవసాయం చేద్దామని సీఎం హోదాలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశిస్తే... ఆ ఆదేశాలను ఆయన మేనల్లుడు, మంత్రి తన్నీరు హరీశ్ రావు అమలు చేసేశారు. ఈ మేరకు సిద్దిపేట నియోజకవర్గంలో నియంత్రిత సాగును అమలు చేస్తామని హరీశ్ సమక్షంలో నియోజకవర్గ రైతాంగం తీర్మానం చేసేసింది. అంటే.. మామ ఆదేశిస్తే.. అందరి కంటే ముందు అల్లుడే అమలు చేసేశారన్న మాట.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే కాకుండా తెలంగాణ కోసం మహోద్యమం జరిగినప్పుడు కూడా... ఉద్యమంలో కొంగొత్త నిరసన ఏదైనా వచ్చిందంటే.. దానిని కేసీఆర్ ప్రస్తావించారంటే... అది తొలుత అమలయ్యేది సిద్దిపేటలోనే. హరీశ్ రావు నేతృత్వంలోనే. తీరా తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక.. సీఎం హోదాలో కేసీఆర్ ఏ సరికొత్త నిర్ణయం తీసుకున్నా... దానిని హరీశ్ రావు అందరి కంటే ముందుగా తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే అమలు చేసేస్తారు. అంటే మామ ఏది చెబితే... ఆ మాటను అల్లుడు తూచా తప్పకుండా అందరికంటే ముందుగా అమలు చేసేసి.. ఇతరులకు మార్గం సుగమం చేస్తారన్న మాట. అప్పడెప్పుడో కేసీఆర్ నోట హరిత హారం మాట బయటకు రాగానే... దానిని సిద్దిపేటలో ప్రారంభించేసి హరీశ్ రావు అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా రాష్ట్రంలో సాగుతున్న వ్యవసాయాన్ని నియంత్రితం చేద్దామని కేసీఆర్ మొన్న పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పద్దతి ప్రకారం రైతు తన పొలంలో ఏ పంట వేద్దామన్న విషయాన్ని ప్రభుత్వమే నిర్ధారిస్తుందన్న మాట. ఈ తరహా సాగుపై విపక్షాలు లెక్కలేనన్ని విమర్శలు చేస్తున్నా... మామ కేసీఆర్ అదేశించిన వెంటనే అల్లుడు హరీశ్ రంగంలోకి దిగిపోయారు. నియంత్రిత సాగుపై సిద్దిపేట రైతులతో సమావేశం నిర్వహించిన హరీశ్.. నియంత్రిత సాగు వల్ల ఒనగూడే లాభాలను ప్రస్తావించారు. దీంతో సిద్దిపేట రైతాంగం... నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసేసింది. అంటే... సిద్దిపేట పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన పంటలే వేస్తామని ఆ నియోజకవర్గ రైతాంగం ముక్తకంఠంతో తేల్చి చెప్పేసిందన్న మాట. నియంత్రిత సాగుపై కేసీఆర్ ఆదేశాలను హరీశ్ రావు అమలు చేసిన తీరును తెలుసుకున్న మిగిలిన ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించేశారు.

Next Story