అమరావతిలో 'ప్రగతి భవన్' స్కెచ్‌....?!!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 6:20 PM GMT
అమరావతిలో ప్రగతి భవన్ స్కెచ్‌....?!!!

దసరా నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో వైఎస్ఆర్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ పార్టీ ఫిరాయింపులు మీద పెద్ద ఎత్తునే పోరాడారు. సీఎం అయిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.."టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సలహా ఇచ్చారని కాని..అలా చేస్తే తనకు చంద్రబాబుకు తేడా ఏంటని అన్నారు?". వైఎస్ జగన్ గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా..మాట మీద నిలబడతారు అని అనుకుంటారు. కాని..మొన్న ప్రగతి భవన్‌కు వెళ్లి వచ్చాక..జగన్ మారిపోయాడేమో అనిపిస్తోంది. బీజేపీ చేపట్టిన ఆకర్ష్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షింపబడకు ముందే లాగేయాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. అందుకే వంశీకి గాలం వేసినట్లు చెప్పుకోవచ్చు. ఈ ఆలోచన జగన్‌దా? లేకపోతే జగన్‌ మైండ్‌లోకి 'ప్రగతి భవన్' పెద్దలు ఇంజస్ట్ చేశారా?

టీడీపీని ప్రతిపక్ష హోదా నుంచి దించేయడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ పెద్ద పథక రచన చేసినట్లే కనిపిస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న ఆయన సామాజికవర్గంతోనే టీడీపీని చీల్చాలనే ప్రణాళికలు రచించినట్లు ఉంది. 'ప్రగతి భవన్ పథకం' ప్రకారం టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురిని లాగేయాలి. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను ఇండిపెండెంట్ గ్రూప్‌గా కూర్చోపెట్టాలి. ఆరుగురు ఎమ్మెల్యేలకు పదువులు, డబ్బులు, కాంట్రాక్ట్‌లు ఆశ చూపారని సమాచారం. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలతో కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాస రావు చర్చించినట్లు ఏ టౌన్ టాక్‌. వీరి గాలానికి వంశీ, మరో ఎమ్మెల్యే మాత్రమే పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరి పథకం పారలేదు.

వల్లభనేని వంశీకి , జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నేకు తెలంగాణాలో విలువైన ఆస్తులున్నాయి. వంశీపై గన్నవరంలో రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుంది. టీడీపీలో వంశీ పరిస్థితి కూడా బాగోలేదు. దేవినేని ఉమా రూపంలో వంశీ అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. అందుకే...వైఎస్ఆర్‌ సీపీ నుంచి వచ్చిన ఆఫర్‌ను ఉపయోగించుకోవాలి అనుకున్నాడు వంశీ. ఈ గన్నవరం ఎమ్మెల్యేకు రాజ్యసభ ఇవ్వడం , హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారు. ముందస్తు హామీలతోనే వైస్ జగన్ ను వంశీ కలిసినట్లు తెలుస్తోంది.ఇది హఠాత్తుగా జరిగింది కాదు ! వంశీ పకడ్బందీగా ఇదంతా చేశాడు !.

వైసీపీ మీద టీడీపీ మాటల దాడి పెంచింది. సో..టీడీపీ నోరు మూయించాలంటే ఉప ఎన్నిక రావాలి. ఉప ఎన్నిక రావాలంటే.. ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి . అదీ ప్రతిపక్ష ఎమ్మెల్యే. అదీ టీడీపీ ఎమ్మెల్యే. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలవాలి. అప్పుడు టీడీపీ నోరు మూత పడుతుంది. ఇదంతా 'ప్రగతి భవన్ పథకం' అని ఏపీలో టాక్‌.

కేంద్రానికి, వైఎస్ జగన్ కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. కేంద్రం కూడా జగన్‌పై సానుకూలంగా ఉండాలంటే ఉప ఎన్నిక వచ్చి..దానిలో వైఎస్ఆర్‌ సీపీ గెలవాలి. ఇటీవల జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్‌కు కేసీఆర్ ఈ సలహా ఇచ్చారని అమరావతిలో చెవులు కొరుక్కుంటున్నారు.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story