రైతులకు కేసీఆర్ మరో శుభవార్త
By సుభాష్ Published on 7 Oct 2020 7:50 AM GMTరైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా తగ్గిపోనందున రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రభుత్వ ఏజన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మరోసారి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఏజన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. అన్నారు. మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని సూచించారు. 17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు లేకుండా తీసుకువస్తే ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.
గ్రామాల్లో వరికోతల కార్యక్రమం నెల రోజులకుపైగా కొనసాగుతుందని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉందని పక్కాగా అంచనా వేయాలన్నారు.
సాగునీటి సౌకర్యం క్రమంగా పెరుగుతుండటంతో పడావుగా ఉన్న భూములు కూడా బాగవుతూ, సాగులోకి వస్తున్నాయన్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తుండటంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా గ్రామాలకు తిరిగివచ్చి భూములను సాగు చేసుకోవడం సంతోషకరమన్నారు.
తెలంగాణ రాష్ట్ర గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దకుంటోందని, సౌర సరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.