కౌన్ బనేగా కరోడ్ పతిలో 5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు టీచర్ గా బ్రతకుతున్నాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sept 2020 7:14 PM IST
కౌన్ బనేగా కరోడ్ పతిలో 5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు టీచర్ గా బ్రతకుతున్నాడు..!

కౌన్ బనేగా కరోడ్ పతి ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని.. ప్రైజ్ మనీ సొంతం చేసుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వ్యక్తే చంపారన్ కు చెందిన సుశీల్ కుమార్. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 కోట్ల రూపాయలు సుశీల్ కుమార్ కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం లో గెలుపొందాడు. ఆ తర్వాత అతడి లైఫ్ లో ఏమేమి చోటుచేసుకుంది అన్నది తాజాగా అతడు తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించాడు.

ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత తాను మద్యానికి, సిగరెట్లకు బానిస అయ్యానని వివరించాడు. డబ్బులు ఇతరులకు ఇచ్చి మోసపోయానని.. చివరికి భార్యతో కూడా మనస్పర్థలే అని వివరించాడు సుశీల్. అంతేకాదు ‘The worst time of my life was after I won KBC’ అంటూ తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.

2015 నుండి 2016 మధ్య నా జీవితంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయని సుశీల్ వెల్లడించాడు. సుశీల్ కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 5 లో ప్రైజ్ మనీని సొంతం చేసుకున్న తర్వాత నెలలో 15 రోజుల పాటూ బీహార్ లో ఏ ఫంక్షన్ జరిగినా తనను హాజరవ్వమని అడిగేవారట. దీంతో అతడి చదువు కూడా నాశనం అయింది. మీడియాలో ఇంటర్వ్యూలు వస్తూ ఉండడంతో తాను పలు చోట్ల పెట్టుబడులు పెట్టి.. తాను ఏదో ఒకటి చేస్తున్నానని వారికి తెలిసేలా చేసేవాడు. కానీ ఆ తర్వాత తెలిసిందేమిటంటే పెట్టిన పెట్టుబడులన్నీ నష్టపోయాడని..!

సుశీల్ ఆ తర్వాత ఫిలాంత్రఫిస్ట్ గా మారిపోయాడు. 50వేల రూపాయలు ప్రతి నెలా దానం చేస్తూ ఉండేవాడు. కానీ అందులో కూడా అతడు మోసపోయాడు. చివరికి భార్యతో కూడా అతడికి మనస్పర్థలు వచ్చేసాయి. తన భర్త ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోతున్నాడంటూ ఆమె భాధను వ్యక్తం చేసేది. చివరికి ఇద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకునే దాకా వెళ్ళింది.

ఢిల్లీకి చెందిన కొందరు విద్యార్థి సంఘాలతో కలిసే వాడు. కొత్త కొత్త ఐడియాలను వారు తీసుకుని వచ్చే వారు. కానీ మద్యం మత్తులో సుశీల్ ఉండడం.. సిగరెట్లు ఎలా పడితే అలా తాగుతూ ఉండడంతో వారితో జర్నీ ముందుకు సాగలేదు.

ఇంట్లో ఉంటూ గంటల తరబడి సినిమాలు చూస్తూ ఉండేవాడు. దీంతో తాను కూడా దర్శకుడవుదామని భావించాడు. వెంటనే ముంబైకి వచ్చేశాడు. ఎన్నో ఆశలతో ముంబైకి వచ్చేసిన సుశీల్ దర్శకుడు అవ్వడం కంటే ముందు టీవీ సీరియల్స్ లో పని చేయమని చెప్పారట. సుశీల్ ఓ స్క్రిప్టును రాయగా అది 20000 రూపాయలకు అమ్మేశారట.

రోజూ ఇంట్లో కూర్చుని.. టీవీ చూసుకుంటూ గడిపేస్తూ ఉండేవాడు.. సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ ఆలోచిస్తూ గడిపేవాడు. తాను ముంబైకి దర్శకుడు అవ్వాలని రాలేదు.. నా నుండి నేపు తప్పించుకోడానికి వచ్చాను అని భావించడం మొదలుపెట్టాడు. మనసు చెప్పింది వింటేనే అసలైన ఆనందం అని గుర్తించాడు. ఫేమస్ అయిన వ్యక్తిగా అందరూ గుర్తించడం కంటే మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడం చాలా ముఖ్యమని సుశీల్ తనను తాను సముదాయించుకున్నాడు.

ముంబై నుండి సొంత ఊరికి చేరుకున్న సుశీల్ ఇప్పుడు టీచర్ వృత్తిలో ఆనందాన్ని వెతుక్కున్నాడు. మద్యం మానేశాడు. గత సంవత్సర కాలంగా సిగరెట్ ను ముట్టలేదని చెప్పుకొచ్చాడు. డబ్బు వస్తే చాలు హాయిగా బ్రతికేయొచ్చు అని అందరూ భావిస్తారు.. కానీ మనశ్శాంతి కరువైతే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరిగా నిద్రపోవడానికి కూడా వీలవదని సుశీల్ జీవితాన్ని చూస్తే మనందరికీ అర్థం అయిపోతుంది.

Next Story