అర్ణబ్ గోస్వామితో డిబేట్.. నటి కస్తూరి భోంచేస్తూ కనిపించింది..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 July 2020 8:32 AM GMT
అర్ణబ్ గోస్వామితో డిబేట్.. నటి కస్తూరి భోంచేస్తూ కనిపించింది..!

అర్ణబ్ గోస్వామి తో డిబేట్ అంటే మామూలుగా ఉండదు. ఆ డిబేట్ లలో ఎంతో మంది పాల్గొంటూ ఉంటారు. తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా అర్ణబ్ షోలో పాల్గొన్నారు. ఆమె చేసిన ఓ పని దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి అర్ణబ్ గోస్వామి తన ఛానల్ లో డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్ లో పాల్గొన్న కస్తూరి శంకర్ లంచ్ చేస్తూ కనిపించారు. డిబేట్ కు హాజరైన ఇతరులతో అర్ణబ్ మాట్లాడుతో ఉండగా కస్తూరి స్పూన్ తో లంచ్ చేసేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఆమె కాన్ఫిడెన్స్ ను పలువురు మెచ్చుకున్నారు.కస్తూరి మాత్రం ఇది అనుకోకుండా చోటు చేసుకున్న ఘటన అని తెలిపారు. తాను వీడియో చాటింగ్ లో పాల్గొన్నాక కెమెరాను ఆఫ్ చేయడం మరచిపోయానని ఈ దక్షిణాది నటి తెలిపారు. ఆదివారం సాయంత్రం రిపబ్లిక్ టీవీలో ఈ డిబేట్ చోటుచేసుకుంది.

తనను పలువురు అభినందిస్తూ ఉండడంపై కస్తూరి స్పందించారు. దాదాపు గంట పాటూ అర్ణబ్ గోస్వామి లైవ్ డిబేట్ లో పాల్గొన్నానని.. ఆయన హైపర్ మోడ్ లో మాట్లాడుతూ ఉండడాన్ని చూస్తూ ఉన్నానని.. ఎలాగూ నన్ను మాట్లాడించలేదని.. దీంతో లంచ్ చేయాలని అనుకున్నా.. కానీ స్కైప్ నుండి సైన్ ఆఫ్ అవ్వడం మర్చిపోయా అని తెలిపారు. తాను చేసిన పనికి అందరినీ క్షమాపణలు కోరుతున్నానని.. ఎవరినీ కించపరచాలని ఈ పని చేయలేదని తెలుపుతూ ట్వీట్ చేశారు.

గంటకు పైగా ఎదురుచూసినా కూడా తనకు మాట్లాడేందుకు అర్ణబ్ అవకాశం ఇవ్వలేదని తెలిపారు. 'నేను 67 నిమిషాల పాటూ లైవ్ డిబేట్ లో ఉన్నప్పటికీ ఒక్క పదం కూడా మాట్లాడలేదు.. దీంతో తినాలని నిర్ణయించుకున్నా.. స్కైప్ నుండి సైన్ ఆఫ్ అవ్వడం మర్చిపోయా' అని చెప్పుకొచ్చారు. ఇంతకూ మీరు ఏమి తిన్నారు అని నెటిజన్లు ఆమెను అడగగా.. పొంగల్ తిన్నానని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన మాటలతో ఎంతో మందికి నీళ్లు తాగించేలా చేసిన అర్ణబ్ గోస్వామి షోలో.. ఎంతో కులాసాగా కస్తూరి పొంగల్ తినేసిందని పలువురు వీడియోను షేర్ చేస్తున్నారు.

Next Story