వాసన పట్టుకుని 12 కిలోమీటర్లు పరిగెత్తిన పోలీసు కుక్క.. ట్విస్ట్ ఏమిటంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 July 2020 2:58 AM GMTబెంగళూరు: ఎన్నో నేరాలలో దోషులను పట్టుకోడానికి పోలీసు కుక్కలు చేసే సహాయం అంతా ఇంతా కాదు. చిన్న చిన్న విషయాల నుండి.. పెద్ద పెద్ద క్లూలను పోలీసు కుక్కలు తీసుకుని వచ్చి వాటిని పరిష్కరించేలా చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ పోలీసు కుక్క వాసన పట్టుకుని ఏకంగా 12 కిలోమీటర్లు పరిగెత్తుకుని వెళ్ళింది.. అలా ఓ ఇంటి ముందు ఆగడంతో పోలీసులకు కేసును పరిష్కరించడం చాలా సులువైంది. వారంకు పైగా ఎటూ తేలని కేసును పోలీసు కుక్క పరిష్కరించేసింది.
కర్ణాటక రాష్ట్రం దావణగేరే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్బు విషయంలో చోటుచేసుకున్న గొడవలో ఓ వ్యక్తి హత్య చేయబడ్డాడు. ఈ కేసును చేధించడానికి పోలీసులు సరైన క్లూ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
డబ్బు విషయమై చేతన్ కు చంద్ర నాయక్ అనే వ్యక్తికి గొడవ జరిగింది. చేతన్ కు అంతకు ముందే క్రిమినల్ రికార్డు ఉంది. పోలీసుల దగ్గర ఉన్న రివాల్వర్ ను దొంగిలించిన చేతన్ తన నేరాలకు ఉపయోగించడం మొదలుపెట్టాడు. చంద్ర నాయక్ తో గొడవ జరిగిన సమయంలో చేతన్ తన దగ్గర ఉన్న ఆ రివాల్వర్ ను తీసి కాల్చేశాడు. దీంతో అక్కడికక్కడే చంద్ర నాయక్ మరణించాడు. వారం రోజులు దాటినా కూడా పోలీసులు ఈ కేసును చేధించలేక పోయారు. దీంతో డాగ్ స్క్వాడ్ ను ఘటనా స్థలానికి తీసుకుని వచ్చారు.
'తుంగ' పది సంవత్సరాల డాబర్ మ్యాన్ కుక్క పోలీసుల దగ్గర సర్వీస్ చేయడంలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. 50కి పైగా మర్డర్ కేసులు, 60 పైగా దొంగతనాల కేసులను సాల్వ్ చేయడంలో తుంగ పోలీసులకు సహాయం చేసిందని దావణగేరె పోలీసు సూపరింటెండెంట్ హనుమంత రాయ్ తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన తుంగ దాదాపు 12 కిలోమీటర్లు పరిగెత్తింది. తుంగతో పాటూ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కూడా వెళ్ళారు. అలా పరిగెత్తుకుంటూ వెళ్లిన తుంగ కాశిపుర్ లోని ఓ ఇంటి ముందు ఆగింది. ఆ ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి పనులపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పట్టుకుని విచారణ చేయగా జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పేశాడు. అతడి దగ్గర నుండి పోలీసు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. హుబ్లీ లోని పోలీసు స్టేషన్ లో చేతన్ పోలీసుల దగ్గర నుండి తుపాకీని కొట్టేసినట్లు తెలుసుకున్నారు. తుంగ తమ హీరో అని.. కర్ణాటక అడిషనల్ డీజీపీ అమర్ కుమార్ పాండే తెలిపారు.