కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2020 10:21 AM GMT
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇక కర్ణాటకలో ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. పేద- ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కాగా డీకే శివకుమార్‌కి పాజిటివ్ తేలడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు, గత కొద్ది రోజులుగా శివకుమార్‌ని కలిసిన వారికి కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు. సోమవారం, మంగళవారం ఆయన వరద ప్రభావిత జిల్లాలైన బెళగావి, బాగల్‌కోట్‌లలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో వాయిదా వేసుకుంటున్నట్లు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల కర్ణాటక సీఎం యెడియూరప్ప, మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య, ఆయన కుమారుడుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఇక కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 2,83,665 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,97,625 మంది కోలుకోగా .. 81,230 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 4,810 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 70శాతం ఉండగా.. మరణాల రేటు 1.7శాతంగా ఉంది.

Next Story
Share it