కరీంనగర్: భారీ అగ్ని ప్రమాదం.. రూ. 2 కోట్ల ఆస్తినష్టం
By సుభాష్ Published on 9 Oct 2020 3:54 AM GMTకరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత గదుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గదుల్లో ఉన్న మిషన్ భగీరథ మీటర్లు, పైప్‌లైన్ సామాగ్రి దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే మిషన్ భగీరథకు సంబంధించి సామాగ్రి దగ్ధమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదవశాత్తున మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కాగా, మంటలు వ్యాపించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కార్చిచ్చుగా మారి గోడౌన్‌లో ఉన్న సామాగ్రి దగ్ధమైపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో మంటలు ఎలా చెలరేగాయి అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.