దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి: అర్ధరాత్రి మితిమీరిపోతున్న పోకిరీల సెల్ఫీలు

By సుభాష్  Published on  9 Oct 2020 3:25 AM GMT
దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి: అర్ధరాత్రి మితిమీరిపోతున్న పోకిరీల సెల్ఫీలు

ముఖ్యాంశాలు

  • ప్రమాదకరంగా యువత సెల్ఫీలు
  • అర్ధరాత్రుల్లో నడిరోడ్డుపై ప్రమాదకరంగా సెల్ఫీలు
  • నడిరోడ్డుపై ఫోటోలు దిగుతూ వాహనాలకు ఆటంకం

హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి సమయంలో సెల్ఫీలు దిగుతూ ఫోజులిస్తున్నారు. బ్రిడ్జిపై ప్రమాదకరంగా సెల్పీలు దిగుతుండటంతో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. వారి ఆదేశాలు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయంలో బ్రిడ్జిపై దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఫోటోలు దిగుతుండగా చూసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.గత నెల 25న ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి దుర్గం చెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారిపోయింది. దీంతో వందలాది మంది అక్కడికి వచ్చి ఎంజాయ్‌ చేస్తున్నారు. సాయంత్రం సయంలో పర్యాటకులను ఆకట్టుకునేలా లైటింగ్‌ ఉండటంతో యువకులతో పాటు పెద్దలు కూడా ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అయితే వంతెన ప్రారమైన తర్వాత వంతెనపై వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి. దీంతో పర్యాటకుల వల్ల వాహనాలకు తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది. నడి రోడ్డుపైనే సెల్ఫీలు దిగుతుండటంతో వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇలా బ్రిడ్జిపై ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతుండటంతో ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. బ్రిడ్జిపై వాహనాలు వేగంగా వెళ్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఆగడం లేదు. సాయంత్రం సమయంలోనే కాకుండా అర్ధరాత్రి సమయంలో యువకులు ఫోటోలు దిగుతూ కనిపిస్తున్నాయి.ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి పెరిగిపోతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్‌ సమయంలో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. కానీ పర్యాటక కేంద్రాన్ని అస్వాదించాలే గాని ఇలా సెల్ఫీలు దిగితే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని పలువురు మండిపడుతున్నారు.Next Story