కారులో మూడు మృతదేహాలు.. అనుమానాలెన్నో..

By అంజి  Published on  17 Feb 2020 6:54 AM GMT
కారులో మూడు మృతదేహాలు.. అనుమానాలెన్నో..

కరీంనగర్‌లో మరో ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. కాకతీయ కెనాల్‌ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. తిమ్మపూర్‌ మండలం యాదవులపల్లి దగ్గరికి కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దాదాపు 20 రోజుల తర్వాత కారు బయటపడింది. కారులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. మృతులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబంగా పోలీసులు గుర్తించారు. జనవరి 27న ఏపీ 15బీఎన్‌3438 నెంబర్‌ గల కాకతీయ కెనాల్‌లో అదుపు తప్పి పడిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు నారెడ్డి సత్యనారాయణరెడ్డి, రాధ, సహస్రగా గుర్తించారు.

కారు ప్రమాదంపై సీపీ

కారు ప్రమాదస్థలాన్ని జిల్లా కలెక్టర్‌, సీపీ కమలాసన్‌రెడ్డి పరిశీలించారు. కాగా ఈ ప్రమాదంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు కారును గుర్తించామని సీపీ తెలిపారు. జనవరి 27న ప్రమాదం జరిగినట్టు నిర్దారణకు వచ్చామన్నారు. సంవత్సరం క్రితం సత్యనారాయణరెడ్డి కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, కారుపై పలు చలాన్లు ఉన్నాయని, ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

ఎలాంటి గొడవలు లేవు

తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని మృతురాలి సోదరుడు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తెలిపారు. తరచూ విహార యాత్రకు వెళ్తారు.. అలాగే వెళ్లారనుకున్నామని అన్నారు.

సత్యనారాయణరెడ్డి మిత్రులు

సత్యనారాయణరెడ్డి అదృశ్యంపై 20 రోజులుగా ఆందోళనలో ఉన్నామని.. అతని మిత్రులు తెలిపారు. సత్యనారాయణ రెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవన్నారు.

అయితే ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు, బంధువులకు అనుమానాలు రాలేదా..?, ఒక వేళ వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు. జరిగిన ప్రమాదాన్ని పోలీసులు కూడా ఎందుకు గుర్తించలేదు?, ఇది ప్రమాదమా లేక కుట్ర కోణం ఉందా? అని పలు రకాలు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

Next Story