ఆ విషయంలో కంగనా రనౌత్ కు షాక్ ఇచ్చారుగా..?
By తోట వంశీ కుమార్ Published on 1 Sept 2020 8:57 AM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఎన్నో కోణాలు ఉన్నాయని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సామాజిక మాధ్యమాల్లో చెబుతూ వెళుతోంది. కొందరు కంగనా కరెక్ట్ గా మాట్లాడుతోంది అని చెబుతుంటే మరికొందరేమో కంగనా సుశాంత్ మరణాన్ని తన పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఇన్నాళ్లూ తన టీమ్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఉన్న కంగనా రనౌత్.. ఇటీవలే తనంతట తానే ట్విట్టర్ లోకి అడుగుపెట్టింది. ఆ అకౌంట్ ను ట్విట్టర్ కూడా వెరిఫై చేసింది. కంగనా రనౌత్ మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లకు దగ్గరవుతున్న సమయంలో ఆమె ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలైంది. రోజుకు 40000 నుండి 50000 వరకూ కంగనా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని కంగనా ఫాలోవర్ ఒకరు గుర్తించి ఆమెను అడిగారు.
నేను ఇది గమనించా. ఈ ప్రదేశం నాకు కొత్త.ఎందుకు ఇలా చేస్తున్నారో మరి. జాతీయవాదులు ప్రతి చోట కష్టపడాల్సి వస్తుంది. రాకెట్ చాలా బలంగా ఉంది. ఆటోమేటిక్ గా అన్‌ఫాలో అయిన వారికి హృదయపూర్వక క్షమాపణలు అంటూ కంగనా పేర్కొంది. అలాగే ఈ పనిని ఎవరో కావాలనే చేస్తున్నారనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తం చేసింది కంగనా..!
బాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ మీద కూడా కంగనా కామెంట్లు చేసింది. కెరీర్ తొలినాళ్లలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు తనపై డ్రగ్స్ ప్రయోగించి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పుకొచ్చింది కంగనారనౌత్. బాలీవుడ్‌లో అవకాశాల్ని ఇప్పించే నెపంతో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు తన జీవితంలోకి ప్రవేశించాడని.. ఓ గురువులా నా కెరీర్‌ను తీర్చిదిద్దుతానని ఓ ‘క్యారెక్టర్ ఆర్టిస్టు’ నా జీవితంలోకి ఎంటర్ అయ్యాడని తెలిపింది.
ముంబయిలో ఓ ఆంటీతో కలిసి ఉంటుండగా ఆ క్యారెక్టర్ ఆర్టిస్టు ఆమెతో కూడా పరిచయం పెంచుకున్నాడు. మేం ముగ్గురం కలిసి ఒకే చోట ఉండేవాళ్లం. కొన్నాళ్లకు ఆంటీని ఇంటి నుంచి బయటకు పంపించి నన్ను గృహనిర్భంధం చేశాడు. నన్ను రోజూ ఏవో పార్టీలకు తీసుకెళ్లేవాడు.. నాకు తెలియకుండా డ్రగ్స్ ఇప్పించేవాడు. ఎదురు ప్రశ్నిస్తే శారీరకంగా హింసించేవాడు. 2006లో నాకు ‘గ్యాంగ్‌స్టర్' చిత్రంలో అవకాశం రావడంతో నేను తన ఆధీనంలో లేకుండా పోతానని భయపడ్డాడు. ఇంజక్షన్స్ ద్వారా మత్తులో ఉంచి షూటింగ్‌లకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. ‘గ్యాంగ్‌స్టర్' దర్శకుడు అనురాగ్‌బసు తన ఆఫీసులో ఉంచి.. నన్ను అతడి బారి నుండి తప్పించాడని తెలిపింది కంగనా రనౌత్. ఇంతకూ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు అని చెప్పలేదు కంగనా..!