అడివిలో అక్షయ్ సాహసయాత్ర.. ఏనుగు విసర్జితాలతో టీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2020 2:44 AM GMT
అడివిలో అక్షయ్ సాహసయాత్ర.. ఏనుగు విసర్జితాలతో టీ

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అడవిలో సాహసయాత్ర చేశారు. బ్రిటన్ మాజీ సైనికుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వైవల్ అడ్వెంచరిస్టు బేర్ గ్రిల్స్ తో కలిసి ఈ సాహసయాత్ర చేశారు. ఆ సాహసాలు ఎలాంటివో చూడాలంటే సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 14 వరకు ఆగాల్సిందే. డిస్కవరీ వైల్డ్ ఛానెల్ నిర్వహిస్తున్న కార్యక్రమం 'ఇన్ టు ది వైల్డ్'. ఈ కార్యక్రమంలో భారతదేశం తరపున నరేంద్ర మోదీ, రజినీకాంత్ తర్వాత అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. కర్ణాటకలోని బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ఎపిసోడ్ను చిత్రీకరించారు. ఒకరోజులోనే అక్షయ్ ఈ షూటింగ్ను పూర్తి చేశారని సమాచారం.

ఇక ఈ కార్యక్రమంపై అక్షయ్ కుమార్ ఆసక్తికర సమాచారం పంచుకున్నారు. బేర్ గ్రిల్స్ తో 'ఇన్ టు ది వైల్డ్..' కార్యక్రమం అనగానే ఎన్నో కఠినమైన సవాళ్ల గురించి ఊహించుకున్నానని.. కానీ బేర్ గ్రిల్స్ తనను పూర్తిగా విస్మయానికి గురిచేశాడని, ఊహించని రీతిలో ఏనుగు మలంతో చేసిన టీ తాగించాడని తెలిపారు. ఏమైనా బేర్ తో ఎపిసోడ్ అద్భుతంగా సాగిందని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ చిన్న టీజర్ను ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ టీజర్ లో బేర్ గ్రిల్స్ తన కొంటెతనాన్ని చూపించాడు. అక్షయ్ కుమార్ ఏనుగు విసర్జితాలతో చేసిన టీ తాగుతుండగా, తాను మాత్రం తప్పించుకున్నాడు. "అక్షయ్ కుమార్... అటు చూడండి" అంటూ అక్షయ్ అటు తిరగ్గానే తన మగ్గులో ఉన్న ద్రవాన్ని పారబోశాడు. ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానెల్లో ప్రసారం కానుంది.



Next Story