ఊపందుకున్న ఉద్యమం..  సినిమాను బతికించుకుందాం.. సినిమా హాళ్లను తెరవనివ్వండి..!

By సుభాష్  Published on  1 Sep 2020 2:39 AM GMT
ఊపందుకున్న ఉద్యమం..  సినిమాను బతికించుకుందాం.. సినిమా హాళ్లను తెరవనివ్వండి..!

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించారు. దీంతో సినిమా థియేటర్లను కూడా మూసి వేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 25 నుండి భారతదేశంలో సినిమా థియేటర్లను మూసి వేశారు. ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ జరుగుతూ ఉండడంతో సినిమా థియేటర్లను ఎప్పుడు తెరుస్తారా అని సినిమా థియేటర్ల ఓనర్లు, సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం రాలేదు.

దేశవ్యాప్తంగా ఉన్నటు వంటి నటీ నటులు, చిత్ర నిర్మాతలు, దర్శకులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆదివారం నాడు సినిమాలను బ్రతికించుకోవాలనే ఆన్ లైన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సినిమాలను బ్రతికించుకుందామనే పోస్టులు పెట్టారు.

లాక్ డౌన్ ముగిసిన తర్వాత జూన్ నెల నుండి భారత ప్రభుత్వం హోటల్స్, మాల్స్ వంటి వాటిని తెరచుకోడానికి అనుమతులు ఇస్తూ వస్తోంది. అన్ లాక్ 4 గైడ్ లైన్స్ సెప్టెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా అమలు లోకి వస్తున్నప్పటికీ సినిమా థియేటర్లను ఆపరేట్ చేయడానికి అనుమతులు ఇవ్వలేదు.

ఆదివారం నాడు దేశంలోని అతి పెద్ద మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ సినిమాలను బ్రతికించుకోవాలని హ్యాష్ ట్యాగ్ ను పోస్టు చేసింది. సినిమాల మీద సినిమా థియేటర్ల మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారని.. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తున్న సంగతిని వెల్లడించారు. ఇప్పటికే చాలా దేశాల్లో సినిమా థియేటర్లు నడుపుకోడానికి అనుమతులు ఇచ్చారు.. భారతదేశంలో కూడా అనుమతి ఇవ్వాలని సదరు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యాజమాన్యం భారత ప్రభుత్వాన్ని కోరింది. కోవిద్-19 సోకకుండా హైజీన్ తో కూడుకున్న సినిమా ఎక్స్పీరియెన్స్ ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామని చెబుతున్నారు. ఏవియేషన్, మెట్రో, మాల్స్, రెస్టారెంట్ వంటివి నడుపుకోడానికి అనుమతులు ఇచ్చినప్పుడు సినిమా థియేటర్లకు కూడా అవకాశం ఇవ్వాలని మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ కేంద్రానికి రాసిన లెటర్ లో కోరింది. పలువురు బాలీవుడ్ నిర్మాతలు, నటులు, డిజిటల్ రంగానికి చెందిన వారు కూడా సినిమా థియేటర్లను తెరవాలని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

'సపోర్ట్ మూవీ థియేటర్స్' ఉద్యమం ఆన్ లైన్ లో మొదలైన ఈ ఉద్యమం కొద్దిసేపట్లోనే నెటిజన్లు కూడా దానికి మద్దతును తెలిపారు. 'సపోర్ట్ మూవీ థియేటర్స్' ఉద్యమంలో భాగం 'సేవ్ సినిమా' అంటూ నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్ లైన్ ఉద్యమంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో.. సినీ ప్రేమికులకు ఎటువంటి వార్త చెబుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

Next Story