శివసేనపై మరోసారి విరుచుకుపడ్డ కంగనా.. పప్పూ సేన మిస్‌ అవుతోందంటూ..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2020 10:48 AM GMT
శివసేనపై మరోసారి విరుచుకుపడ్డ కంగనా.. పప్పూ సేన మిస్‌ అవుతోందంటూ..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అధికార పార్టీని పప్పూసేన అని విమర్శించారు. కంగనా రనౌత్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత కంగన తొలిసారి స్పందించారు.

నవరాత్రుల సందర్భంగా ఎవరెవరు ఉపవాసం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దుర్గా పూజ తర్వాత తాను ఉపవాసం చేస్తున్నానని చెప్పారు. తనపై మరో ఎఫ్ఐఆర్ నమోదైందని.. చూస్తుంటే పప్పూసేనకు తనపై అభిమానం ఎక్కువైనట్టుందన్నారు. అందుకే తనను వదల్లేకపోతున్నారని తెలిపింది. తనను మిస్ కావాల్సిన అవసరం లేదని.. త్వరలోనే ముంబైకి వచ్చేస్తానని తెలిపింది. ముంబైని పీవోకేతో పోలుస్తూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా.. కంగనా ప్రస్తుతం 'తలైవి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

Next Story
Share it