దేశంలో చాలానే రాష్ట్రాలు ఉండొచ్చు. కానీ.. తమ జాతికి చెందిన వారన్నా.. తమ జాతి మూలాలు ఉన్న వారన్నా తమిళియన్లకు.. కన్నడిగులకు.. మలయాళీలకు ఉన్నంత అభిమానం మరే రాష్ట్రానికి చెందిన వారికి ఉండదనే చెప్పాలి. అప్పుడెప్పుడో తాతల కాలంలోనే దేశాన్ని వదిలి పెట్టి వెళ్లినా.. ఆమె మూలాలు తమవే అన్న చిన్న పాయింట్ తో తమిళ తంబీలు మహా ఆనందానికి గురవుతున్నారు.

ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో దూసుకెళుతున్న భారత సంతతి మహిళ కమలా హారీస్ పోస్టర్లు ఇప్పుడు తమిళనాడులో దర్శనమిస్తున్నాయి. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడుకు చెందిన వారన్న సంగతి తెలిసిందే. ఇక.. కమలా హారీస్ అమెరికాలోనే పుట్టినప్పటికీ.. ఆమె మూలాలు తమకు చెందినవి కావటంతో ఇప్పుడు వారంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

డెమొక్రాట్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష రేసులో నిలిచిన ఆమెకు తమ సంపూర్ణ మద్దతును పోస్టర్లలో తంబీలు చాటి చెబుతున్నారు. పీవీ గోపాలన్ మనమరాలు విజయం సాధించిందంటూ పోస్టర్లలో పెద్ద ఎత్తున ముద్రిస్తున్నారు. ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోల్ని కమలా హారీస్ సమీప బంధువు మీనా హారీస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ ఫోటోలు వైరల్ గా మారాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.