కమలా పేరు ప్రకటించటంతో చైనా ఎందుకు ఉలిక్కిపడింది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 2:42 PM IST
కమలా పేరు ప్రకటించటంతో చైనా ఎందుకు ఉలిక్కిపడింది?

తాజాగా తీసుకున్న ఒక్క నిర్ణయం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై మరింత ఆసక్తిని పెంచటమే కాదు.. ఇప్పటి నుంచి మొదలయ్యే రాజకీయం మరోలా ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆసియా- ఆఫ్రికన్ మూలాలు ఉన్న ఒక మహిళా నేత.. దేశ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలోకి దిగటం ఇప్పుడో సంచలనంగా మారిందంటున్నారు. ఆమె ఎంపికపై పలువురికి నమ్మకం ఉన్నప్పటికి వాస్తవరూపం దాల్చే అవకాశం ఉందా? అన్న సందేహం చాలామందిలో ఉంది. దాన్ని పటాపంచలు చేశారు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బైడెన్.

అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న తను.. తమ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా మహిళను ఎంపిక చేస్తామని ఆయన గతంలోనే మాటిచ్చారు. అందుకు తగ్గట్లే ఆయన ప్రకటన ఉండటం ఆసక్తికరంగా మారింది.దీనికి తోడు.. రెండు బలమైన జాతుల తోడ్పాటు ఎన్నికల్లో డెమొక్రాట్లకు దన్నుగా మారే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

కమలా ఎంట్రీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చిరాగ్గా మారితే.. చైనాలోనూ కొత్త కలవరం మొదలైందని చెబుతున్నారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ కారణంగా.. చైనా తెగ ఇబ్బంది పడుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగటానికి ట్రంప్ గా భావిస్తున్న డ్రాగన్ దేశానికి.. కమలా పేరు విన్నంతనే ఉలిక్కిపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

చైనా అధ్యక్షుడు జిన్జియాంగ్.. హాంకాంగ్ లకు సంబంధించిన మానవహక్కుల సమస్యలపై చైనాకు వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారు కమలా. చైనా విధానాల్ని ఎండగట్టటంలో ఆమె ముందుంటారు. దీంతో.. ఆమె అభ్యర్థిత్వం తెర మీదకు వచ్చినంతనే చైనాలో కలవరం మొదలైనట్లుగా చెబుతున్నారు. దీనికితోడు.. కమలా అభ్యర్థిత్వంపై అధికారికంగా స్పందించటానికి చైనా నో చెప్పటం దీనికోకారణంగా చెబుతున్నారు.

ట్రంప్ విషయంలో తీవ్రమైన కోపంతో ఉన్న చైనాకు.. డెమొక్రాట్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా తెర మీదకు రావటం చైనాకు ఏ మాత్రం ఇష్టం లేదన్న మాట వినిపిస్తోంది. రెండు దేశాల మధ్య ప్రస్తుత వివాద పరిస్థితుల నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఆమె ఎంపిక ఉందన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. ఆమె ఎంట్రీతో అమెరికా అధ్యక్ష ఎన్నిక స్వరూపం మారిందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Next Story