ఎవరీ కమలా హరీస్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 7:02 AM GMT
ఎవరీ కమలా హరీస్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

రాజకీయాల్లో ‘‘జాతి’’కి మించిన భావోద్వేగ అంశం మరొకటి ఉండదు. దేశ పౌరురాలే అయినా.. మూలాల్లో ‘విదేశీ’ ఉండటానికి మించిన శాపం మరొకటి ఉండదు. కొందరికి ఇదో శాపంగా మారితే.. చాలా కొద్దిమందికి వరంలా మారుతుంది. రెండో కోవకు చెందుతారు అమెరికాకు చెందిన మనమ్మాయ్ కమలా హరీస్. మరింత బాగా అర్థం కావాలంటే.. సోనియాగాంధీని తీసుకోండి. రాజీవ్ భార్యగా దశాబ్దాల తరబడి దేశంలో ఉన్నా.. ఆమెకు ఏదైనా కీలక పదవిని అప్పజెప్పే సమయంలో.. ఆమెలోని ‘ఇటలీ’ మూలాల్ని ఒక్కసారిగా తెర మీదకు తీసుకురావటం.. తీవ్రంగా వ్యతిరేకించటం తెలిసిందే.

మన దగ్గరే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ‘జాతి’కి ‘రంగు’కు విశేషమైన ప్రాధాన్యత ఇచ్చే అమెరికా లాంటి దేశంలో.. శ్వేతేతర జాతికి చెందిన భారత.. ఆఫ్రికన్ మూలాలు ఉన్న కమలా హరీస్ కు ఎదురయ్యే సవాళ్లు అన్ని ఇన్ని కావు. అంచనాలకు తగ్గట్లే అధ్యక్ష రేసులో ఉన్న బైడెన్.. కమలా హరీస్ ను అమెరికా ఉపాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థిగా ఎంపిక చేయటం తెలిసిందే. ఇంతకూ కమలా హారీస్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

ఆమె అమెరికాలో 1964లో జన్మించారు. కాలిఫోర్సియాలో పుట్టిన ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్.. డొనాల్డ్ హారీస్. చెన్నైకి చెందిన శ్యామలా ఎండోక్రినాలజీలో పరిశోధన కోసం అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్లింది. ఇక.. శ్యామల (అదేనండి కమలా హారీస్ తాత) తండ్రి పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. దౌత్య అధికారిగా పని చేశారు కూడా.

తన చిన్నతనంలో కమలా హరీస్ తరచూ చెన్నైకి వచ్చేవారు. ఆమె మీద తాత ప్రభావం బాగా ఎక్కువని చెబుతారు. ఇదిలా ఉంటే.. కమలా 2014లో డగ్లస్ ను పెళ్లి చేసుకున్నారు. దీంతో కమలా కాస్త భిన్నమైన సంతతికి చెందిన వ్యక్తిగా నిలుస్తారు. ఆసియా తల్లి - ఆఫ్రికన్ తండ్రి.. ఈ రెండింటికి చిహ్నమైన ఆమెను.. పలువురు కమలను పొలిటికల్ గా లేడీ ఒబామాగా అభివర్ణిస్తారు. ఇక..ఆమె విద్యార్హతలు.. రాజకీయంగా ఆమె జర్నీని చూస్తే.. 1986లో హోవార్డు వర్సిటీ నుంచి రాజకీయ.. ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేశారు. హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

డెమొక్రటిక్ పార్టీలో చేరిన ఆమె అంచలంచెలుగా ఎదిగారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా ఎన్నికయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి నల్లజాతి.. దక్షిణాసియా సంతతి మహిళగా రికార్డు నెలకొల్పారు. తర్వాత అటార్నీ జనరల్ గా వ్యవహరించారు. మూడేళ్ల క్రితం (2017లో) కాలిఫోర్నియా సెనేటర్ గా ఎన్నికయ్యారు. తాజాగా.. ఆమె అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎంపికై చరిత్ర క్రియేట్ చేశారు.

Next Story