కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

By అంజి  Published on  23 Feb 2020 3:19 AM GMT
కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కుమ్రంభీం ఆసిఫాబాద్: సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేపర్‌ మిల్లులో మట్టి పెల్లలు కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం పనులు జరుగుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. బాయిలర్‌ నిర్మాణం పనుల్లో ఒక్కసారిగా మట్టి దిబ్బలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో మరి కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదుగురు కార్మికులు మట్టిపెళ్లల కింద 50 లోతులో చిక్కుకుపోయారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

పేపర్‌ మిల్లులో ఒక్కో షిప్ట్‌లో సగటున 12 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది కార్మికులు ఉన్నారనేది ఇంకా తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఏఎస్పీ వైవీఎస్‌ సుదీంద్ర ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలోకి మిల్లు అధికారులను తప్ప లోపలికి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. పేపర్‌ మిల్లు తిరిగి ప్రారంభమయ్యాక.. ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.

2014లో ఈ పేపర్‌ మిల్లు మూతపడింది. అనంతరం 2018లో మంత్రి కేటీఆర్‌ తిరిగి మిల్లును ప్రారంభించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి ఈ మిల్లుపై 6 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ కోసం స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర కృషి చేశారు. జెకె పేపర్‌ లిమిటెడ్‌ కంపెనీకి తెలంగాణ గవర్నమెంట్‌ ప్రోత్సహకాలు ఇవ్వడంతో.. ఈ పేపర్‌ మిల్లు తిరిగి ప్రారంభమైంది.

Next Story