కొల్లాపూర్ లో 'సింగం' డాన్స్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jan 2020 12:59 PM ISTకొన్నాళ్ల క్రితం వరకూ ఆయన, కెసీఆర్ లు మంచి మిత్రులు. రాజకీయాలే కావు, సామాజిక వర్గాల పరంగా సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ స్వయానా రాజవంశం కాకపోయినా ఆయన నిజాం ఏలుబడిలోని ఒక సంస్థానానికి రాజు. దాంతో కేసీఆర్ వద్ద ఆయన గౌరవ మర్యాదలకేం లోటు ఉండేది కాదు. అంతే కాదు.. చాలా మంది టీఆర్ఎస్ నేతలే కేసీఆర్ ను నమ్మని సమయంలో ఆయన తన కాంగ్రెస్ మంత్రిపదవిని కాదనుకుని కేసీఆర్ తో చేతులు కలిపారు. అందుకే ఆయనది పార్టీలో ప్రత్యేక స్థానం.
కానీ ఇప్పుడు కలచెదిరింది. కథ మారింది. ఆయనకు కన్నీరే ఇక మిగిలింది. ఆయన పేరు జూపల్లి కృష్ణారావు. ఆయన 2018 లో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ప్రభంజనం వీస్తున్న సమయంలో కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతుల్లో ఓడిపోయారు. దాంతో మంత్రి కావాల్సిన ఆయన ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. తరువాత పరిణామాల్లో రాజకీయ ప్రత్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కండువాను వదిలి, గులాబీ కండువాను ధరించారు. ఎమ్మెల్యేగా కొల్లాపూర్ కి ప్రతినిథి అయ్యారు. కేసీఆర్ కు చేరువయ్యారు. పురపాలక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అభ్యర్థుల ఎంపిక, టికెట్ల వితరణ చేసే అధికారాన్ని కేసీఆర్ ఇచ్చారు. దీంతో జూపల్లి పరిస్థితి “ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చినట్టు” అయింది. తన మద్దతుదార్లకు టికెట్ ఇవ్వాలని తన కన్నా చిన్నవాడు, రాజకీయ ప్రత్యర్థి అయిన హర్షవర్ధన్ ను ఆయన అడగలేరు. కేసీఆర్ వద్దకు వెళ్లి విన్నవించుకుందామంటే అపాయింట్ మెంట్ దొరకదాయె. దాంతో ఆయన తన మద్దతుదార్లను ఇండిపెండెంట్లుగా పోటీకి నిలబెట్టారు.
ఎంతైనా సింహం లాంటోడు చిట్టెలుక ఎలా అవుతాడు. అందుకే తన అభ్యర్థులందరికీ సింహం గుర్తు ఇప్పించి, సింహంలా ప్రచారం ప్రారంభించాడు. హర్ష వర్ధన్.. జూపల్లి సింహం గుర్తుకు ప్రచారం చేస్తున్న ఫోటోలు, విడియోలను కేసీఆర్ కు సమర్పించుకున్నాడు. కేసీఆర్ పిలిపించి మాట్లాడి, రెబెల్స్ ను పోటీనుంచి తప్పించమని చెప్పాడు. “ఎవరి బలం ఏమిటో చూసుకుందామని” చెప్పి జూపల్లి తిరుగుబాటు జెండా ఎగరేశాడు. ఇప్పుడు ఎన్నికల వేళ జూపల్లిని తొలగించినా సమస్యే. తొలగించకపోయినా సమస్యే. అయితే ఇలాంటప్పుడు కేసీఆర్ సైలెంట్ గా ఉండి, సమయం కోసం వేచి చూస్తారు. ఇప్పుడదే చేస్తున్నారు.
మరో వైపు జూపల్లి విజృంభించి మరీ ప్రచారం చేస్తున్నారు. జూపల్లి తన బలం నిరూపించుకుంటాడా? లోకల్ గా బీరం హర్షవర్ధన్ రెడ్డిని, స్టేట్ లెవెల్ లో కేసీఆర్ ని దెబ్బ కొట్టగలుగుతాడా? కేసీఆర్ సింహం గుర్తుపై పోటీ చేస్తున్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తారా? లేక పిట్టపోరు పిట్టపోరు తీర్చిన పిల్లిలాగా అటో రొట్టె ముక్క, ఇటో రొట్టె ముక్కా తిని చక్కా కూర్చుంటారా? లేక చివరికి జూపల్లి సింగం డాన్స్ చేస్తారా? ఏంజరుగుతుందన్నది ఎన్నికల వేళ తెలిసిపోతుంది. జనవరి 22 దాకా ఆగండి.