ఐపీఎల్-13వ సీజన్ వాయిదా పడడం సిగ్గుచేటు
By తోట వంశీ కుమార్ Published on 7 April 2020 2:06 PM GMTకరోనా వైరస్ మహమ్మారి వల్ల క్రికెట్ కార్యకలాపాలన్ని నిలిచిపోయాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఏప్రిల్ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ జరగడం పోవడం బాధాకరమని ఇంగ్లాండ్ విధ్వంసకర ఆటగాడు జోస్ బట్లర్ అన్నాడు. అనుకున్న సమయానికి టోర్నీ జరగకపోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించాడు. ఈ ఏడాదే మరో సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ఐపీఎల్‌లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే.
"ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో నా కన్నా మీకే బాగా తెలుసు. టోర్నీ ఎప్పుడు మొదలవుతుందని ఆడుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు. అందుకే టోర్నీ జరుగుతుందా లేదా అన్నది ఇప్పడే నిర్ణయించలేరు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. టోర్నీ ద్వారా వచ్చే రెవెన్యూ చాలా అధిక మొత్తంలో ఉంటుంది. క్రికెటర్లకు అతి ముఖ్యమైన టోర్నీలా ఐపీఎల్ మారిపోయింది. అనుకున్న సమయానికి ఈ టోర్నీ జరగకపోవడం సిగ్గుచేటు" అని బట్లర్ అన్నాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్‌లో టోర్నీ నిర్వహించడం కష్టం. మరోవైపు ఈ టోర్నీ సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆ సమయంలో విదేశీ ఆటగాళ్లు అందుడాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయా జాతీయ జట్ల తరుపున ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉందన్నారు.
ఇదిలా ఉంటే.. భారత్‌లో 100 మందికి పైగా మరణించగా.. ప్రపంచ వ్యాప్తంగా 80వేల మంది మృత్యువాత పడ్డారు.