పండుగపూట భారతీయుల మనసుల్ని దోచేలా జోబైడెన్ ట్వీట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 12:23 PM IST
పండుగపూట భారతీయుల మనసుల్ని దోచేలా జోబైడెన్ ట్వీట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత ప్రాధాన్యత పెరుగుతోంది. భారత మూలాలున్న అమెరికన్ల మీద గురి పెట్టిన డెమొక్రాట్లు.. ప్రతి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఇప్పటికే భారత మూలాలున్న కమలా హ్యారీస్ ను దేశ ఉపాధ్యక్షురాలి పదవికి పోటీకి దింపటం తెలిసిందే. దీంతో.. సైద్ధాంతిక అంశాల్ని మరిచిపోయి.. భారత సమాజం మొత్తం కమలా హ్యారీస్ పక్షాన నిలిచినట్లుగా చెబుతున్నారు. అరుదుగా లభించే అవకాశాన్ని మిస్ కాకూడదన్నట్లుగా భారత అమెరికన్లు పలువురు పేర్కొంటున్నారు.

ఓ పక్క భారత్.. మరోపక్క ఆఫ్రికన్ మూలాలతో ఉన్న కమలా హ్యారీస్ డెమొక్రాట్లకు చక్కటి ఆయుధంగా మారినట్లుగా చెబుతున్నారు. ఆమె పేరును ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసిన నాటి నుంచి.. ఆమెపై దేశాధ్యక్షుడు ట్రంప్ సైతం తీవ్రవ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తాజాగా వినాయకచవితిని పురస్కరించుకొని అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.



ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజా కరోనా నేపథ్యంలో గతంలో మాదిరి కాక.. ఈసారి సింఫుల్ గా పండుగను నిర్వహించుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే మండపాల్ని ఈసారికి ఆపేశారు. ఎవరికి వారు ఇళ్లల్లోనే సింఫుల్ గా పండుగను నిర్వహించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలపటమే కాదు.. ‘‘పండుగను నిర్వహించుకుంటున్న మీకు అన్ని విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీస్సులు కలగాలని.. కొత్త ప్రారంభానికి దారి చూపించాలని కోరుకుంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.



దేశాధ్యక్షుడి బరిలో ఉన్న జోబైడెన్ తో పాటు.. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మనమ్మాయి కమలా హ్యారీస్ సైతం వినాయకచవితి శుభాకాంక్షలు తెలిజయేశారు. వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాదు.. ఈసారి అమెరికా ఎన్నికల్లో పెరిగిన భారత ప్రాధాన్యతను తాజా ట్వీట్లు తెలియజేస్తున్నాయన్న మాట వినిపిస్తోంది.

Next Story