జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దు.. కారణమిదే..?
TSSPDCL cancels junior lineman written exam due to malpractices.రాత పరీక్షలో అక్రమాలు జరగడంతో టీఎస్‌ఎస్పీడీసీఎల్
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2022 10:55 AM ISTరాత పరీక్షలో అక్రమాలు జరగడంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు పోలీసుల నుంచి నివేదిక అందడంతో ఉద్యోగార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్లు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే మరో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సంవత్సరం మే నెలలో 1000 జూనియర్ లైన్‌మెన్(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి నోటికేషన్‌ను టీఎస్‌ఎస్పీడీసీఎల్ జారీ చేసింది. జూలై 17న రాత పరీక్షను నిర్వహించారు. 50 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా.. ఘట్‌కేసర్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పోలీసుల దర్యాప్తులో రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, దళారులతో కలిసి పలువురు అభ్యర్థుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. 181 మంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు గుర్తించారు. ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులకు ఈ వ్యవహారంలో సంబంధం ఉండే అవకాశం ఉందని డిస్కంకు అందజేసిన నివేదికలో పోలీసులు తెలిపారు.
పరీక్షల్లో అక్రమాల దృష్ట్యా పరీక్షను రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేయడంతో పాటు వినతి పత్రం అందించారు. ఈ పరిణామాలన్నింటిని డిస్కం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దుకు డిస్కం నిర్ణయం తీసుకుంది.