అలర్ట్.. నేటి నుంచి గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ
TSPSC Group 4 Applications start from December 30th.తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 30 Dec 2022 4:20 AM GMTతెలంగాణ రాష్ట్రంలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల కాగా.. డిసెంబర్ 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. కొన్నికారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేటి(డిసెంబర్ 30) నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షను ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
గ్రూప్-4 ఉద్యోగాల్లో ప్రధానంగా నాలుగు కేటగిరీలకు సంబంధిన పోస్టులున్నాయి. 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులు.
జూనియర్ అకౌంటెంట్ పోస్టులు (429) : ఆర్థిక శాఖలో 191, పురపాలశాఖలో 238 పోస్టులు ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు(6,859).. వ్యవసాయశాఖలో 44, బీసీ సంక్షేమశాఖలో 307, పౌరసరఫరాల శాఖలో 72, అటవీశాఖలో 23, ఆర్థికశాకలో 46, వైద్య-ఆరోగ్యశాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టులు ఉన్నాయి. హోంశాఖలో 133, నీటిపారుదల శాఖలో 51, కార్మికశాఖలో 128, మైనార్టీ సంక్షేమశాఖలో 191, పురపాలక శాఖలో 601, పంచాయతీరాజ్ శాఖలో 1245, రెవ్యెన్యూ శాఖలో 2,077, ఎస్సీ అభివృద్ధి శాఖలో 474, సెకండరీ విద్యాశాఖలో 97, రవాణాశాఖలో 20, గిరిజన సంక్షేమశాఖలో 221, మహిళా శిశు సంక్షేమశాఖలో 18, యువజన సర్వీసుల శాఖలో 13 పోస్టులు ఉన్నాయి.
జూనియర్ ఆడిటర్ పోస్టులు 18, వార్డు ఆఫీసర్ పోస్టులు 1862 మొత్తం 9,168 పోస్టులు ఉన్నాయి.
భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం
గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని టీఎస్పీఎస్సీ అంచనా వేస్తోంది. దాదాపు 6 నుంచి 7 లక్షల మధ్య అప్లికేషన్లు రావొచ్చునని బావిస్తోంది. గతంలో 700 వీఆర్ఓ పోస్టులకు దాదాపు 10లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం 9 వేలకు పైగా పోస్టులు ఉండడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.