గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. అక్టోబర్ 16న ప్రిలిమ్స్
TSPSC Group 1 prelims on Oct 16.తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీపై స్పష్టత వచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 15 Jun 2022 8:40 AM ISTతెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీపై స్పష్టత వచ్చింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా జులై లేదా ఆగస్టులో పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. పరీక్ష సన్నద్దతకు అధిక సమయం అవసరం అని అభ్యర్థుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలో ఇతర పోటీ పరీక్షల తేదీలు లేని రోజులపై టీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులు సుదీర్ఘ సమీక్ష నిర్వహించి.. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష తేదీ, కేంద్రాలు, అభ్యర్థుల హాల్‌టికెట్ల గురించి సమాచారాన్నిటీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
503 పోస్టులతో వెలువడిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. 3,80,202 మంది అభ్యర్థులు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేశారు. అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రిలిమ్స్ పరీక్షల తరువాత కమిషన్ వెల్లడించనుంది.
గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచే పకడ్బందీగా ముందుకెళ్తున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆగస్టులోనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని తొలుత అనుకొన్నామని అయితే.. ఇదే సమయంలో యూపీఎస్సీ, బ్యాంక్, టీఎస్ పోలీస్ తదితర పలు పోటీ పరీక్షలు జరుగనుండటంతో వాటిని కూడా రాసుకొనేలా అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని భావించినట్లు తెలిపారు. అందుకే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16న, మెయిన్ పరీక్షను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.