ఎల్లుండే తెలంగాణ టెట్‌ పరీక్ష.. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన సూచనలివే

సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహణకు తెలంగాణ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

By అంజి  Published on  13 Sept 2023 10:39 AM IST
TS Tet Exam, candidates, Telangana

ఎల్లుండే తెలంగాణ టెట్‌ పరీక్ష.. అభ్యర్థులు తప్పక పాటించాల్సిన సూచనలివే

తెలంగాణ ప్రభుత్వం పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహణకు ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టెట్‌ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ్టి నుంచి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 27వ తేదీన పరీక్ష ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే పరీక్షకు సంబంధించి విద్యాశాఖ పలు కీలక సూచనలను జారీ చేసింది. ఎగ్జామ్‌ సెంటర్‌ అడ్రస్‌ని ఒక రోజు ముందుగానే చూసుకోవాలని తెలిపింది.

ఎగ్జామ్‌ హాల్‌లోకి హాల్‌ టికెట్‌ తప్ప.. ఇతర వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దు. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత వివరాలను సరి చూసుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సిగ్నేచర్‌ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు.. ఫొటోను అతికించి గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకొని, ఆధార్‌ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో అనుమతి అనంతరమే పరీక్షకు పర్మిషన్‌ ఇవ్వడంలో తగు నిర్ణయం తీసుకుంటారు. పరీక్షకు గంట ముందే హాల్‌లోకి అనుమతి ఇస్తారు. పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, డిసేబిలిటీ వంటి వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.

మొదటి పేపర్ పరీక్షకు సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. సాయంత్రం పరీక్షకు సంబంధించి 5 తర్వాత మాత్రమే హాల్ నుంచి బయటికి అనుమతిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు. పరీక్షా హాల్‌లో ఇబ్బందులు సృష్టిస్తే అలాంటి అభ్యర్థులపై చర్యలు తీసుకుంటారు. టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం 2,83,620 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయి.

హాల్ టికెట్లు ఎలా పొందాలంటే?

https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ 'డౌన్లోడ్ Hall Tickets 2023 అనే ఆప్షన్ పై నొక్కండి. మీ వివరాలను ఎంట్రీ చేయాలి. మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

Next Story