గుడ్‌న్యూస్ : పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం
TS Police Recruitment Good news to Aspirants two years age relaxation.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు సడలిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు తొలిసారిగా 95 శాతం ఉద్యోగ కోటా అమలు చేయడంతో పాటు.. గత రెండేళ్లుగా కరోనా ప్రభావం నేఫథ్యంలో వయోపరిమితిని పెంచాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలను ఆదేశించారు.
అయితే.. పోలీసు ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. వయో పరిమితి పెంపు నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగిస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.
పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
— Telangana CMO (@TelanganaCMO) May 20, 2022
నిన్నటి వరకు 9.33 లక్షల దరఖాస్తులు
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారంతో దరఖాస్తులకు గడువు ముగుస్తున్నది. అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో మహిళా అభ్యర్థుల నుంచే 2. 05 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇక మొత్తం దరఖాస్తుల్లో బీసీ అభ్యర్థులు 52 శాతం, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 19 శాతం, ఓసీ 7 శాతం ఉన్నట్టు చెప్పారు.
ఇక వయోపరిమితి పెంపు నేపథ్యంలో మరో రెండు నుంచి నాలుగు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.