తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు, 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. తాజాగా పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో మరో 1,433 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో 657 ఏఈఈ, 113ఏఈ, హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 91 వేల 142 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 11 వేల 103 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. కాంటాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మిగిలిన 80 వేల 39 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది.