వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని సొసైటీ ఫర్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు.
By Kalasani Durgapraveen Published on 28 Oct 2024 5:52 PM ISTరాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉందని సొసైటీ ఫర్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. సోమవారం విజయవాడ సీడాప్ కార్యాలయంలో సృజనాత్మకత భవిష్యత్తు నైపుణ్యాలపై నిర్వహించిన వర్క్ షాపులో సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పటికే 6 కొత్త పారిశ్రామిక విధానాలను ప్రకటించారని.. అవన్నీ పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. సీడాప్ నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ, ఉపాధి కార్యక్రమాలు అటు ప్రధానమంత్రి మోడీ విజన్ అయిన వికసిత్ భారత్ 2047, ఆత్మనిర్భర్ భారత్‌కు..మన సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు దగ్గరగా ఉన్నాయన్నారు. వీరి దార్శికతతో రూపొందించిన విజన్ మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవకాశాలు పొందడానికి అనుగుణంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన యువతకు గమ్యస్థానంగా మార్చాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ పేరుతో నైపుణ్య గణన కార్యక్రమం చేపడుతున్నా మన్నారు. ఇది మన ప్రజల నైపుణ్యాలను గుర్తించి వాటిని మ్యాపింగ్ చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమని, దేశానికి కూడా ఒక మార్గదర్శకం కానుందన్నారు. మరోవైపు సీడాప్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1.36 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చామని, వీరిలో 1.04 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. సీఎం చంద్రబాబు లక్ష్యమైన వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అనుగుణంగా.. ఇక నుంచి ఏడాదికి లక్ష ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలు ఇచ్చే ఎంట్రప్రెన్యూర్లను కూడా తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని దీపక్ రెడ్డి తెలిపారు.
సీడాప్ సంస్థ ప్రస్తుతం డీడీయూజీకేవై కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో మరో 12 శిక్షణా కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య శిక్షణకి వన్ స్టాప్ సెంటర్ గా మారబోతోందన్నారు. మా లక్ష్యాలు సమర్థవంతంగా ముందుకు సాగడానికి సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లు, పరిశ్రమ భాగస్వాములతో, శిక్షణ భాగస్వాములతో సంప్రదింపులు జరిపి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తున్నామని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. అంతేకాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) లను ఏర్పాటు చేయాలని పలు సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ (ఎస్ఎస్సీ)లను కూడా ఆహ్వానించామని.. స్థానిక పరిశ్రమలు, కమ్యూనిటీలకు మద్దతు ఇచ్చేందుకు కొత్త క్లస్టర్ నమూనాల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను తగ్గించడానికి వీలవుతుందన్నారు.
సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి అంతర్జాతీయస్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపైనా చురుగ్గా పనిచేస్తున్నామన్నారు. నైపుణ్య శిక్షణలో ఆచరణాత్మకంగా, సమర్థవంతంగా అమలు చేయడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 'భారతదేశానికే నైపుణ్య రాజధాని'గా మార్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ, ఏపీటీడీసీ, లిడ్ క్యాప్, మారిటైమ్ బోర్డు వంటి ఇతర కార్పొరేషన్ల చైర్మన్లతో కూడా సమావేశమై అందరి లక్ష్యమైన స్కిల్ ఏపీ దిశగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నామని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు.