అల‌ర్ట్.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు ఈవెంట్స్ నేటి నుంచే.. ఇవీ పాటించాల్సిందే

Telangana police jobs events starts from Today.ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీలో కీల‌క‌మైన ఫిజిక‌ల్ ఈవెంట్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Dec 2022 3:53 AM GMT
అల‌ర్ట్.. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు ఈవెంట్స్ నేటి నుంచే.. ఇవీ పాటించాల్సిందే

తెలంగాణ‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీలో కీల‌క‌మైన ఫిజిక‌ల్ ఈవెంట్స్ నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. 27 రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న‌ ఈ వెంట్స్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాథ‌మిక ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన 2,37,862 మంది అభ్య‌ర్థులకు రన్నింగ్‌, లాంగ్‌, హైజంప్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు సిద్దిపేటలోని ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్వ‌హిస్తున్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈ సారి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్ర‌తీ ఈవెంట్ సీసీ కెమెరాల నిఘా నీడ‌లో జ‌రుగుతోంది. ఎవ‌రైనా అభ్య‌ర్థులు అభ్యంత‌రం తెలిపితే సీసీ కెమెరాల ఆధారంగా విచార‌ణ చేస్తారు.

ఈవెంట్స్‌కు వెళ్లేవారికి సూచన‌లు..

- అభ్య‌ర్థులు త‌మ వెంట అడ్మిట్ కార్డు, పార్ట్‌-2 ద‌ర‌ఖాస్తు కాపీ, క‌మ్యూనిటీ స‌ర్టిఫికేట్‌, డిశ్చార్జి బుక్‌/ నిర‌భ్యంత‌ర‌ప‌త్రం, ఏజెన్సీ ఏరియా స‌ర్టిఫికేట్‌(గిరిజ‌న అభ్య‌ర్థులైతే) త‌మ వెంట త‌ప్ప‌నిస‌రిగా తీసుకువెళ్లాలి.

- అడ్మిట్‌కార్డులో పేర్కొన్న స‌మ‌యానికి కంటే ముందుగానే అభ్య‌ర్థులు వేదిక వ‌ద్ద‌కు వెళ్లాలి.

- సామాన్లు భ‌ధ్ర‌ప‌ర‌చుకునే క్లాక్‌రూమ్‌లు అందుబాటులో ఉండ‌వు.

- చేతుల‌కు మెహందీ, టాటూల‌ను వేసుకుని రావొద్దు

- సెల్ ఫోన్ల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌రు.

- గ్రౌండ్‌లోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌తి అభ్య‌ర్థి చేతికి డిజిట‌ల్ ఆర్ఎఫ్ఐడీ ప‌రిజ్ఞానంతో కూడాని రిస్ట్ బ్యాండ్‌ను అటాచ్ చేస్తారు. మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లే వ‌ర‌కు దాన్ని ఉంచుకోవాల్సిందే. దాన్ని తీసివేసినా, చించేసినా, ట్యాంప‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా డిస్ క్వాలిఫై చేస్తారు.

- మొద‌ట ప‌రుగుపందెం నిర్వ‌హిస్తారు. పురుషు అభ్య‌ర్థులు 1600 మీట‌ర్లు, మ‌హిళా అభ్య‌ర్థులు 800 మీట‌ర్లు ప‌రుగును నిర్ణీత స‌మ‌యంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

- ఆ త‌రువాత ఎత్తును కొలుస్తారు

- ఎత్తులో అర్హ‌త సాధించిన వారినే లాంగ్ జంప్‌, షాట్‌పుట్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమ‌తి ఇస్తారు.

Next Story