టీఎస్‌: ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. జులై 30 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

SI Prelims hall ticket download from tomorrow 8AM. తెలంగాణలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను సర్కార్ విడతల వారీగా భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగానే ఎస్‌ఐ ఉద్యోగాల

By అంజి  Published on  29 July 2022 4:58 AM GMT
టీఎస్‌: ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. జులై 30 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు

తెలంగాణలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 వేల పోస్టులను సర్కార్ విడతల వారీగా భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగానే ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 25న పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 7న ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లు జులై 30న ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది. పరీక్ష కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది.

అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే [email protected]కు ఈ-మెయిల్‌ చేయవచ్చని లేదా 93937 11110, 939100 5006 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో 35 పట్టణాల్లో 503 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షను ఆగస్టు 7న (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షకు మొత్తం 2,47,217 మంది హాజరుకానున్నారు.

హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు దాని ఏ4 సైజులో ప్రింట్‌ అవుట్‌ను తీసుకోవాలి. ప్రింటౌట్ తీసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోనే హాల్‌టికెట్‌లో నిర్దేశించి ప్లేస్‌లో అతికించాలి. అతికించిన పాస్‌పోర్ట్ ఫోటో లేని హాల్ టికెట్ ప్రిలిమినరీ రాత పరీక్ష రోజున అంగీకరించబడదు. సరైన హాల్ టిక్కెట్లు లేకుండా పరీక్షా కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు పరీక్షలో ప్రవేశం నిరాకరించబడుతుందని తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తెలిపింది.

ఆగస్టు 21న కానిస్టేబుల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 17,291 పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్లను జారీ చేసింది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 17,291 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందులో 554 ఎస్‌ఐ పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులు, 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Next Story
Share it