రేపే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష.. అభ్యర్థులు ఇవి మర్చిపోవద్దు
Preliminary written test for SI jobs tomorrow. Candidates must follow the rules. నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఏపీ ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగాల
By అంజి Published on 18 Feb 2023 6:34 AM GMTనిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెబుతూ.. ఏపీ ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి పూనుకుంది. ఇప్పటికే పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టులు భర్తీ చేయనున్నారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులు, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు ఉన్నాయి. రేపు సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం జరగనున్న ప్రిలిమ్స్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 291 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల తర్వాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు.
ఇవి తీసుకెళ్లొద్దు..
మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, పర్సు, నోట్సు, ఛార్టులు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల లాంటివి ఏవైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు. అలాంటి వస్తువులను పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని, భద్రపరచడానికి ఎలాంటి అదనపు ఏర్పాట్లు ఉండవని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. పరీక్షా కేంద్రం విషయంలో గందరగోళ పరిస్థితి ఉండకుండా.. అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవచ్చు.
ఇవి తప్పనిసరి..
పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకువెళ్లాలి. హాల్ టికెట్ తో పాటు బ్లాక్ / బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలి. ఇప్పటి వరకు 1,71,936 మంది సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.