సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆ సంస్థలో కొలువుల జాతర మొదలైంది. సింగరేణిలో 651 పోస్టులను మార్చి లోపల భర్తీచేస్తామని సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ విడుదల అవుతుందా అని నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి విడుతగా 372 ట్రైనీ ఉద్యోగాలకు ఆ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 305 పోస్టులను లోకల్.. అంటే సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మానికి చెందిన అభ్యర్థులకు కేటాయించారు. అన్ రిజర్వ్‌డ్‌గా కేటాయించిన 67 పోస్టులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలవారు అర్హులే.
ఇందులో 128 ఫిట్టర్, 51 ఎలక్ట్రీషియన్, 54 వెల్డర్, 22 టర్నర్/మెషినిస్ట్, 14 మోటారు మెకానిక్, 19 ఫౌండ్రీమెన్/మౌల్డర్, 84 జూనియర్ స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు శుక్రవారం మధ్యా హ్నం 3 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www.scclmines.com దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 4 తేదీ తుది గడువు. దరఖాస్తుతోపాటు అర్హతల సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నది. ఎవరూ హార్డ్‌కాపీలను పంపించవద్దని స్పష్టంచేసింది. దరఖాస్తు సమయంలోనే ఎస్బీఐ లింకు ద్వారా రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరో ఐదేండ్ల వరకు సడలింపు ఉంటుంది.
రాతపరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని, ఇంటర్వ్యూలు నిర్వహించబోమని సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. నిరుద్యోగులెవరూ మోసకారుల మాటలను నమ్మవద్దని కోరారు. ఎవరైనా ప్రలోభపెడితే సింగరేణి విజిలెన్స్ విభాగానికి తెలియజేయాలన్నారు.