నిరుద్యోగులకు శుభవార్త.. 16,614 పోలీసు కొలువులకు నోటిఫికేషన్
Notification for 16614 Constable and SI posts released.తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By తోట వంశీ కుమార్ Published on 26 April 2022 8:58 AM ISTతెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. పోలీస్ శాఖతో పాటు ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో మొత్తం 16,614 పోస్టుల భర్తీకి సోమవారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి శ్రీనివాసరావు నాలుగు నోటిఫికేషన్లను జారీ చేశారు. ఇందులో ఎస్సై పోస్టులు, ఇతరవిభాగాల్లో తత్సమాన హోదా ఉండే పోస్టులు కలిపి 587 ఖాళీలను.. కానిస్టేబుల్, తత్సమాన హోదా ఉండే 16,027 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో అతిభారీ నోటిఫికేషన్ కావడం గమనార్హం. 2018లో 18వేల పైచిలుకు పోలీసు పోస్టులు భర్తీ చేయగా.. మరోసారి దాదాపు అదేస్థాయిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీస్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు www.tslprb.in వైబ్‌సైట్ లో మే 2 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని వి.వి శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తు చేసుకొనే అర్హులైన అభ్యర్థులకు ఒక యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. ప్రక్రియ పూర్తయ్యేవరకు అదే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి.. చెక్ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎస్సై, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని తెలిపారు. కానిస్టేబుల్, తత్సమాన హోదా పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలని.. అలాగే 2022 జూలై 1 నాటికి సదరు కోర్సులో ఉత్తీర్ణత సాధించగలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
పోస్టులకు.. విద్యార్హతలు ఇవే..
* పోలీస్ కానిస్టేబుల్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, ఫైర్ మన్, జైలు వార్డర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* సబ్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు కనీసం డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
* ఐటీ, కమ్యూనికేషన్ విభాగంలో ఎస్సై పోస్టులకు.. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీటెక్) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్–కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టా పొంది ఉండాలి.
* పోలీస్ ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఎస్సై పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై) ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఐటీ, కమ్యూనికేషన్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు.. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ లేదా కంప్యూటర్ ఆపరేటర్–ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ లేదా మెకానిక్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా ఒకేషనల్ ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పోస్టుల కోసం పదో తరగతితోపాటు ఐటీఐలో వైర్‌మన్ లేదా మెకానిక్ మోటార్ వెహికిల్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్‌గా సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* పోలీస్ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్ పోస్టుల కోసం ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసి.. ఐటీఐలో ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ మోటార్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్ విభాగంలో తప్పనిసరిగా లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తో బ్యాడ్జ్ నంబర్ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి, రెండేళ్ల పాటు డ్రైవింగ్ చేసిన అనుభవం ఉండాలి.