నిరుద్యోగులకు శుభవార్త..ప్రభుత్వరంగ బ్యాంకుల్లో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలనే నిరుద్యోగులకు ఆయా బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి.
By Knakam Karthik
నిరుద్యోగులకు శుభవార్త..ప్రభుత్వరంగ బ్యాంకుల్లో త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలనే నిరుద్యోగులకు ఆయా బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 50వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమయ్యాయి. తమ వ్యాపార అవసరాలు, విస్తరణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్‌లలో భారీగా కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నాయి. వీటిలో 21వేల మంది ఆఫీసర్లు, మిగిలినవారు క్లర్క్‌లు ఉంటారని ఆయా బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు గానూ.. ఒక్క ఎస్‌బీఐ సుమారు 20వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు సమాచారం. వీరిలో కొందరు స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. కొత్త ఉద్యోగుల నియామకంలో ఇప్పటికే ఎస్‌బీఐ 505 ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీవో), 13,445 మంది జూనియర్ అసోసియేట్స్‌ను నియమించుకోవడం ద్వారా నియామకాల ప్రక్రియను ప్రారంభించింది.
2025 మార్చి నెల లెక్కల ప్రకారం ఎస్‌బీఐలో మొత్తం ఉద్యోగులు 2,36,226 మంది ఉన్నారు. వీరిలో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 1,15,066 మంది బ్యాంక్ రోల్స్‌లో ఉన్నారు. 2024/25లో ఫుల్‌టైమ్ ఉద్యోగికి సగటు వేతనం 40,440.59 రూపాయలుగా ఉన్నది. ఉద్యోగుల విషయంలో ఎస్‌బీఐ తీసుకుంటున్న చర్యల ఫలితంగా మొత్తం ఏటా రెండు శాతం కంటే తక్కువ తేడా ఉంటున్నది. ఇక దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500 మందిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. మార్చ్ 2025 నాటికి పీఎన్‌బీలో మొత్తం 1,02,746 మంది స్టాఫ్ ఉన్నారు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 4వేల మందిని నియమించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.