అమరావతి: ఇవాళ మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల కానుంది. అధికారిక వెబ్‌సైట్, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తారు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేయనున్నట్లు డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి మరియు కలెక్టర్ కార్యాలయాలలో, అలాగే మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. జూన్ 6 నుంచి జూలై 2 మధ్య రెండు దశల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. ప్రిలిమినరీ కీని జూలై 5న, ఫైనల్ కీని ఆగస్టు 1న విడుదల చేశారు. టెట్ స్కోర్‌లకు 20% వెయిటేజీ ఇచ్చామని, అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏడు దశల్లో పూర్తయిందని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి చెప్పారు.