జనవరి 8న ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీని ఏపీపీఎస్సీ ఇవాళ విడుదల చేసింది. ప్రిలిమినరీ కీని తనిఖీ చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కమిషన్ సూచించింది. ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్‌లో జనవరి 11 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరిస్తామని, ఆన్‌లైన్‌లో కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఒక్కో అభ్యంతరానికి 100 రూపాయలు తప్పనిసరిగా చెల్లించాలని తెలిపింది.
గడువు తేదీ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని వివరించింది. మొత్తం 111 గ్రూప్ 1 పోస్టులకు 87,718 మంది పరీక్ష రాశారు. మూడు వారాల్లో ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువడిన 90 రోజుల తర్వాత మెయిన్స్ కూడా నిర్వహిస్తారు. అనంతరం జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత నెలలోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 జిల్లాల్లోని 297 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 83.38 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.