ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్ష ఏర్పాట్లపై శనివారం సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 301 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ - 2 పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులు ఉంటారు. అలాగే పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంటాయి.