తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుంది. నిన్నటి వరకు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇవాళే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. పేపర్-1కు 72,771, పేపర్-2కు 1,20,364 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోల్చితే దరఖాస్తులు భారీగా తగ్గడంతో గడువు పెంచే అంశంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
అప్లికేషన్ ఫీజు పెంచడం, ఎక్కువ మంది అభ్యర్థులు డీఎస్సీకి ప్రిపేర్ అవుతుండటం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. దరఖాస్తుల గడువును మరో వారం రోజులు పొడిగిస్తారని సమాచారం. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు టెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచి, ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.