తండ్రికి కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుందో చాటి చెప్పే ఘ‌ట‌న ఇది. త‌న కూతురు ప్ర‌మాదంలో ఉందంటే.. తండ్రి ఏమైనా చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించే ఘ‌ట‌న ఇది. క‌రోనా వైర‌స్ దెబ్బ‌కి దేశ మొత్తం లాక్‌డౌన్. తన కూతురేమో ఊరు కాని ఊళ్లో చదువుకుంటోంది. కరోనా వైరస్ కారణంగా ఆమెతో చదువుకుంటున్న వారు సొంతూళ్లకు వెళ్లిపోయారు. తను వెళ్దామంటే లాక్‌డౌన్ కారణంగా బస్సులు నడవట్లేదు. ఏంచేయాలో అర్థం కావ‌డం లేదు నాన్న అని ఒక్క ఫోన్ కాల్ చేసింది. ఇంకేముంది ఆ తండ్రి మ‌న‌సు విల‌విల లాడిపోయింది. 5 రాష్ట్రాల మీదుగా.. 2500 కి.మీ. దూరం.. ఏకబిగిన 50 గంటలపాటు.. ప్రయాణించి తన బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు.

జార్ఖండ్‌‌లోని బొకారో‌ పట్టణంలో ఓ డాక్ట‌ర్‌(49) నివ‌సిస్తున్నాడు. ఆయనకు 18 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె రాజస్థాన్‌లోని కోట పట్టణంలో చదువుకుంటోంది. క‌రోనా దెబ్బ‌తో బ‌స్సులు బంద్ అయ్యాయి. దీంతో త‌న కూతురు కోట ప‌ట్ట‌ణంలో చిక్కుకుపోయింది. త‌న కూతుర్ని ఎలాగైన ఇంటికి తీసుకురావాల‌ని భావించాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా మంగ‌ళ‌వారం కారులో బ‌య‌లు దేరాడు. సోషల్ డిస్టెన్సింగ్ కోసం ఆయన ఎక్కడా కారును ఆపలేదు. కోట చేరుకోగానే తన కూతుర్ని తీసుకొని బయల్దేరాడు. అలా 50 గంటల్లో ఇల్లు చేరాడు. కోట, బొకరో పట్టణాల మధ్య దూరం 1250 కి.మీ. పైనే. రానుపోను 2500 కి.మీ. ఆయన ప్రయాణించారు.

దీనిపై ఆయ‌న కుమారై మాట్లాడుతూ.. నన్ను ఇంటికి తీసుకురావడం కోసం నాన్న ఐదు రాష్ట్రాల్లో ప్రయాణించాడు. మా నాన్న నిజంగా సూపర్ డాడీ అని ఆయన కూతురు మురిసిపోయింది. ఈ ప్రయాణాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. జార్ఖండ్‌‌లో బయల్దేరిన ఆయన బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్‌లోని కోట పట్టణం చేరుకున్నారు. టైం వేస్ట్ కాకుండా కార్లోనే ఆహారం తీసుకున్నామని ఆయన తెలిపారు. మరో విషయం ఏంటంటే.. ఏకబిగిన 50 గంటలపాటు ప్రయాణం చేసిన ఆ డాక్టర్ తర్వాత రెస్ట్ తీసుకోలేదు. కరోనా ప్రభావంతో వెంటనే డ్యూటీలో చేరిపోయారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.