ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవ్. సడెన్‌గా ఓ రోజు ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి ఎవరు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూశారు. షాక్‌కు గురయ్యారు. భార్య మంచం పై పడి ఉండగా.. భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ఎలా చనిపోయారో తెలియక తలలు పట్టుకున్నారు పోలీసులు. ఇంటిని క్షుణంగా గాలిస్తే ఓ పేపర్‌ దొరికింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

కడలూర్ జిల్లా బన్రూట్టి పరిధిలోని తిరువదిగై గ్రామానికి చెందిన అళగానందన్ కుమారుడు మణికంఠన్(29) మహేశ్వరి(25) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మణికంఠన్‌ దేవాలయ గోపురాలకు సంబంధించిన పనులు చేస్తుండేవాడు. అన్యోన్యంగా జీవిస్తున్న నవ దంపతుల ప్రేమకి ప్రతిరూపంగా ఆమె గర్భం దాల్చింది. సడెన్‌గా వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. కాగా కొద్ది రోజుల నుంచి మణికంఠన్ పని వెళ్లడం లేదు. దీంతో దంపతుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.

ఈ క్రమంలో ఓ రోజు ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి ఎలాంటి అలికిడి లేదు. దీంతో స్థానికులు అనుమానంతో లోపలికి వెళ్లి చూసి షాక్‌కు గురయ్యారు. మూడు నెలల గర్భవతి అయిన మహేశ్వరీ మంచం పై విగతజీవిగా పడి ఉండగా.. మణికంఠన్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. రాత్రి వరకూ బాగానే ఉన్న భార్యాభర్తలు అనూహ్యంగా ఎందుకు చనిపోయారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. భార్యని చంపేసి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో ఆరా తీశారు. ఇంట్లో క్షుణ్ణంగా వెతకడంతో చనిపోయే ముందు మణికంఠన్ రాసిన సూసూడ్ లెటర్ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సూసైడ్ లెటర్‌ రాసి పెట్టడంతో అసలేం జరిగిందన్న సస్పెన్స్‌కి తెరపడింది. తాను ఉదయం బయటకు వెళ్లి రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చేప్పటికి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాసి ఉంది. తన వల్లే భార్య, కడుపులో బిడ్డ చనిపోయారని.. అందుకే తాను కూడా ఉరి వేసుకుని చనిపోతున్నట్లు రాశాడు. భార్య శవాన్ని కిందకు దింపి అదే తాడులో ఉరివేసుకుంటున్నాట్లు సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దికాలానికే కలతలు రేగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని.. అది తట్టుకోలేకే భర్త కూడా ఉరి వేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.